Economic Vision: ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ పార్టీల నుంచి హామీల వర్షం కురుస్తోంది. ఓట్ల పండగ ముగియగానే పథకాల పేరిట వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఉచితాల రూపంలో పంపిణీ చేయడం పరిపాటిగా మారింది. ఎంతసేపూ ప్రత్యక్షంగా డబ్బులు పంచి, ఉచితాలు ఇచ్చి తదుపరి ఎన్నికల్లో ఎలా గెలవాలనే ఆలోచనే తప్ప.. రాష్ట్రాన్ని, దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఏం చేస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయనే దూరదృష్టి మన పాలకుల్లో కనిపించడం లేదు. ఇది ఎన్నో ఏళ్లుగా వినపడుతున్న మాట.
ప్రపంచ దేశాలు నేర్పిన పాఠాలేమిటి?
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పూర్తిగా ధ్వంసమైన జపాన్, సహజ వనరులు కూడా లేని సింగపూర్, తీవ్ర పేదరికంలో ఉన్న దక్షిణ కొరియా, ఎడారి దుబాయ్.. నేడు ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తులుగా ఎదిగాయి. దానికి కారణం ఆయా దేశాల పాలకులు చూపిన దూరదృష్టి. సింగపూర్ పితామహుడు లీ కువాన్ యూ ప్రజలకు ఉచితాలు పంచలేదు. అత్యుత్తమ విద్యావ్యవస్థను, మౌలిక వసతులను నిర్మించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పౌరులకు ఉపాధి కల్పించారు. దక్షిణ కొరియా తమ పౌరుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంచి పరిశ్రమలను నెలకొల్పగా, జపాన్ క్రమశిక్షణ, నాణ్యమైన విద్య, పరిశోధనలపై దృష్టి పెట్టింది. ఆయా దేశాల పాలకులు భవిష్యత్ తరాల బాగు కోసం కఠినమైన, సంస్కరణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
మన పాలకులకు, విదేశీ నేతలకు తేడా ఇదే!
అభివృద్ధి చెందిన దేశాల పాలకులు “రాబోయే తరం” గురించి ఆలోచిస్తే.. మన పాలకులు కేవలం “రాబోయే ఎన్నికల” గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. విదేశాల్లో నాణ్యమైన ఉచిత విద్య, మెరుగైన ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాల నిర్మాణానికి బడ్జెట్‌లో సింహభాగం కేటాయిస్తారు. కానీ మన దగ్గర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న నిధుల్లో అత్యధిక భాగం ఓటు బ్యాంకును ఆకట్టుకునే ఉచిత పథకాలకే సరిపోతున్నాయి. దీంతో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, నూతన పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పించడం వంటి అత్యంత కీలకమైన అంశాలు మూలనపడుతున్నాయి.
జెన్ జీ కలల భారత్ ఎప్పుడు సాధ్యం?
నేటి జెన్ జీ (Gen Z) తరం యువత ఉచితాలు కోరడం లేదు. తమ నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగావకాశాలు, నాణ్యమైన విద్య, ఆధునిక సదుపాయాలు కోరుకుంటోంది. పన్ను చెల్లింపుదారుల డబ్బును భవిష్యత్తు తరాల నిర్మాణానికి కాకుండా, కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుతోంది. ఉచితాల సంస్కృతికి స్వస్తి పలికి, ప్రజలను తమ కాళ్లపై తాము నిలబడేలా చేసే సింగపూర్, జపాన్ తరహా అభివృద్ధి మోడల్‌ను అవలంబించినప్పుడే నికరమైన ప్రగతి సాధ్యమవుతుంది.
