Medipally Heist: తెలంగాణ వ్యాప్తంగా వరుస చోరీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దొంగల మూఠాలు ఇళ్లు, దుకాణాలను టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతుండగా, తాజాగా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ చోరీ వెలుగుచూసింది. గోల్డ్ షాప్‌లోకి చొరబడిన దుండగులు సుమారు రూ.7 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను అపహరించుకుపోయారు.
ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి కెసరానగర్ బస్‌స్టాప్ వద్ద ఉన్న క్యారెట్ లేన్ టాటా గోల్డ్ షాప్‌లో అర్ధరాత్రి ఏడుగురు దొంగల ముఠా చొరబడింది. ఆరుగురు బయట పహారా కాయగా, ఒకడు షాపు షట్టర్‌ను తొలగించి లోపలికి ప్రవేశించాడు. డిస్ప్లేలో ఉన్న కోట్ల విలువైన ఆభరణాలను లూటీ చేశాడు. చోరీ జరుగుతున్న విషయాన్ని గమనించిన బిల్డింగ్ వాచ్మెన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. షాపులోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల కరీంనగర్, చందానగర్లలోని ఖజానా జ్యువెలర్స్‌లో చోరీ జరిగిన మరువకముందే మళ్లీ మేడిపల్లిలో ఇంతటి భారీ దోపిడీ జరగడం వ్యాపారులను, స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
