రామప్ప మైనింగ్ వివాదం.. అవాస్తవాలను కొట్టిపారేసిన సింగరేణి

Ramappa Temple

Ramappa Temple

Ramappa Temple: యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన చారిత్రాత్మక రామప్ప దేవాలయానికి సింగరేణి మైనింగ్‌ వల్ల ప్రమాదం పొంచి ఉందంటూ వస్తున్న వార్తలను సింగరేణి యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఆ వార్తలు కేవలం అపోహలు, అవాస్తవాలు మాత్రమేనని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

ములుగు జిల్లా వెంకటాపుర్‌లో చేపట్టిన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని తెలిపింది. భారత పురావస్తు శాఖ (ASI)తో పాటు ఇతర ప్రతిష్టాత్మక సంస్థల ద్వారా శాస్త్రీయంగా అధ్యయనం చేయించిన తర్వాతే తదుపరి అడుగులు వేస్తామని ప్రకటించింది. ఈ అధ్యయన నివేదికల ఆధారంగానే తగిన చర్యలు తీసుకుంటామని వివరించింది.

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థగా రామప్ప ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందనే విషయాన్ని గుర్తించామని యాజమాన్యం పేర్కొంది. పర్యావరణపరంగా, చట్టబద్ధంగా అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటిస్తూనే సింగరేణి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుందని, వారసత్వ సంపద పరిరక్షణకే తమ మొదటి ప్రాధాన్యత అని పునరుద్ఘాటించింది.