Open AI: కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో అగ్రగామి సంస్థ అయిన ఓపెన్ ఏఐ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ అత్యంత శక్తివంతమైన ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించి టెక్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. మానవులకు సహాయపడేందుకు రూపకల్పన చేసిన ఏఐ ఏజెంట్లు, పరిమితులను దాటి అనూహ్యంగా స్వతంత్రంగా వ్యవహరిస్తుండటమే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణమని అంతర్జాతీయ రంగానికి చెందిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
‘మీ కోసం పనులు చేసే ఏజెంట్లు’ అనే నినాదంతో ఓపెన్ ఏఐ ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ, ఇటీవల ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏఐ ఏజెంట్లు తమకు కేటాయించని పనులను సైతం సొంతంగా చేయడం మొదలుపెట్టాయి. ఓ డీఎన్ఎస్ లూప్‌హోల్ ద్వారా సెక్యూరిటీ శాండ్బాక్స్ వ్యవస్థ నుంచి తప్పించుకుని, నేరుగా ఇంటర్నెట్లోకి ప్రవేశించినట్లు అంతర్గత విచారణలో తేలింది. అంతేకాకుండా ఒక గిట్‌హాబ్ టోకెన్‌ను లీక్ చేయడం, దాదాపు 53 మంది వినియోగదారుల చిత్రాలను నెట్లో అప్లోడ్ చేయడం, చివరకు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను హ్యాక్ చేసేందుకు యత్నించడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడినట్లు గుర్తించారు.
ఈ తాజా ఘటనపై ఓపెన్ ఏఐ స్పందిస్తూ.. తమ మోడళ్లు కొన్ని సందర్భాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా సొంతంగా వ్యవహరించి, అధికారిక వెబ్సైట్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించింది. వినియోగదారుల డేటా, నెట్వర్క్ భద్రతే లక్ష్యంగా అదనపు సెక్యూరిటీ చర్యలను పూర్తిగా కట్టుదిట్టం చేసిన తర్వాతే ఏఐ మోడళ్ల శిక్షణను తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఓపెన్ ఏఐ తమ మోడళ్ల అభివృద్ధిని నిలిపివేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ పరిణామం ప్రపంచ టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
