ఫుకెట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. దట్టమైన పొగ ఊపిరి తీయడంతో 11 మంది మృతి, బూడిదైన ఐదు భవనాలు!

Phuket Fire

Phuket Fire

Phuket Fire: ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫుకెట్‌లోని పాటాంగ్ ప్రాంతంలో ఉన్న ఓ బైక్ సేల్స్ షోరూమ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనం మొత్తానికి వేగంగా వ్యాపించడంతో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు.

దట్టమైన పొగతో ఊపిరాడక మృత్యువాత:

షోరూమ్‌లో వాహనాలు, విడిభాగాలు ఉండటంతో మంటలు క్షణాల్లోనే ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. భవనం నిండా దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే దారిలేక చిక్కుకుపోయారు. మృతుల్లో అత్యధిక మంది దట్టమైన పొగ పీల్చడం వల్ల ఊపిరాడకే మరణించినట్లు స్థానిక అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గాయపడిన 36 మందిని తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

భారీగా ఆస్తి నష్టం.. ముమ్మరంగా సహాయక చర్యలు:

ఈ అగ్నికీలల ధాటికి పక్కనే ఉన్న ఐదు వాణిజ్య సముదాయాలతో పాటు, సమీపంలో నిలిపి ఉంచిన పలు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది, కుసోల్ధర్మ్ ఫుకెట్ ఫౌండేషన్ సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భవనంలో చిక్కుకున్న మిగిలిన వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

షోరూమ్ సమీపంలోని విద్యుత్ స్తంభం వద్ద జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు.