Ramayana Theaters: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ థియేటర్లలో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. సాధారణంగా సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు, కలెక్షన్లు, ప్రేక్షకుల స్పందన వార్తల్లో నిలుస్తుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం థియేటర్లలో అందించే ఆహారం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ ఎస్వీఎఫ్ సినిమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. రామాయణ సినిమా ప్రదర్శించే ఆడిటోరియంలలో కేవలం శాకాహార ఆహార పదార్థాలను మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది.
ప్రేక్షకుల మత విశ్వాసాలు, భావోద్వేగాలను గౌరవించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని సంస్థ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో సుమారు 30 ప్రాంతాల్లో థియేటర్లను నిర్వహిస్తున్న ఎస్వీఎఫ్ సినిమాస్ ఈ నిబంధనను అన్ని సినిమాలకు వర్తింపజేయడం లేదు. కేవలం రామాయణ ప్రదర్శించే స్క్రీన్లలోనే ఆడిటోరియం లోపల మాంసాహార పదార్థాల విక్రయాలను నిలిపివేయనుంది. అయితే థియేటర్ వెలుపల ఉన్న ఫుడ్ కౌంటర్లలో మాత్రం వెజ్, నాన్‌వెజ్ ఆహార పదార్థాలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.
ఈ నిర్ణయానికి గతంలో వచ్చిన ప్రేక్షకుల స్పందన కూడా కారణంగా నిలిచింది. 2025లో విడుదలైన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ ప్రదర్శన సమయంలో కొందరు ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్లే ముందు చెప్పులు బయట వదిలి వెళ్లారని సంస్థ గుర్తుచేసుకుంది. అలాగే ‘హనుమాన్ అంశ్’ సినిమా ప్రదర్శన సందర్భంగా ఆడిటోరియంలో కేవలం శాకాహార ఆహార పదార్థాలనే అందించాలని కొందరు ప్రేక్షకులు కోరినట్లు తెలిపింది. ఈ అనుభవాల నేపథ్యంలో రామాయణ చిత్రానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించింది.
కొన్ని సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే అందించవని, ప్రేక్షకులకు వాటితో భావోద్వేగ, ఆధ్యాత్మిక అనుబంధం ఉంటుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా హనుమాన్ చాలీసా వినిపించే సన్నివేశాల్లో థియేటర్ వాతావరణం దేవాలయాన్ని తలపిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుల భక్తి భావనకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, రవి దూబే లక్ష్మణుడిగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రాతో కలిసి యశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు.
మొత్తానికి సినిమా నేపథ్యం, ప్రేక్షకుల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని ఎస్వీఎఫ్ సినిమాస్ తీసుకున్న ఈ నిర్ణయం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. సినిమా అనుభూతి కేవలం వెండితెరపైనే కాకుండా ప్రేక్షకుల భావోద్వేగాలు, నమ్మకాలతోనూ ముడిపడి ఉంటుందని ఈ పరిణామం మరోసారి చాటిచెబుతోంది.
