నిర్మాత బండ్ల గణేష్‌కు భారీ షాక్.. ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా!

Bandla Ganesh

Bandla Ganesh

Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాకుండా బాధితుడి కోర్టు ఖర్చులను సైతం బండ్ల గణేష్ చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం. గతంలోనూ ఆయనపై చెక్ బౌన్స్ కేసుల్లో శిక్షలు, జరిమానాలు విధించగా, ఆయా కేసుల్లో బెయిల్‌పై ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. 2018లో ప్రకాశం జిల్లాకు చెందిన జానకి రామయ్య వద్ద బండ్ల గణేష్ రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జానకి రామయ్య మరణానంతరం ఆయన తండ్రి వెంకటేశ్వర్లుకు బండ్ల గణేష్ రూ.95 లక్షలకు సంబంధించిన చెక్ ఇచ్చారు. అయితే ఆ చెక్ బ్యాంకులో చెల్లకపోవడంతో వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ఒంగోలు కోర్టు తాజాగా బండ్ల గణేష్‌కు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ఇదిలా ఉండగా, గతంలో టాలీవుడ్ రచయిత వక్కంతం వంశీ కూడా బండ్ల గణేష్‌పై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశారు. ‘టెంపర్’ సినిమా కథకు సంబంధించిన పారితోషికం విషయంలో గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో వంశీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో 2017లో హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు బండ్ల గణేష్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.15.86 లక్షల జరిమానా విధించింది. ప్రస్తుతం ఆ కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నట్లు సమాచారం.

ఇక మరికొన్ని చెక్ బౌన్స్ కేసులు కూడా బండ్ల గణేష్‌పై ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాటికి సంబంధించి ఆయన అప్పీల్‌కు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా ఒంగోలు కోర్టు తీర్పుతో మరోసారి బండ్ల గణేష్‌కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.