Gopichand Villain: టాలీవుడ్‌లో ఒకప్పుడు విలన్‌గా తనదైన ముద్ర వేసిన సీనియర్ హీరో గోపీచంద్ మరోసారి ప్రతినాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడా? అంటే ప్రస్తుతం అవుననే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అది కూడా తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నాడనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కాంబినేషన్ నిజమైతే సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
గోపీచంద్ తన సినీ ప్రయాణాన్ని ‘తొలి వలపు’ సినిమాతో హీరోగా ప్రారంభించాడు. అయితే నటుడిగా అతడికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మాత్రం ప్రతినాయక పాత్రలే. ‘జయం’, ‘వర్షం’, ‘నిజం’ చిత్రాల్లో విలన్‌గా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ‘యజ్ఞం’ సినిమాతో హీరోగా విజయాన్ని అందుకుని తన కెరీర్‌ను మరో మలుపు తిప్పుకున్నాడు. అప్పటి నుంచి కథానాయకుడిగానే కొనసాగుతున్న గోపీచంద్ మళ్లీ విలన్ పాత్రలపై దృష్టి పెట్టలేదు.
ఇప్పుడు సూర్యతో కలిసి నటించబోయే సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సూర్య, ‘జై భీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు తర్వాత డీసీ ఫేమ్ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలోనే గోపీచంద్ విలన్ పాత్రలో నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది.
సూర్య సినిమాలకు దక్షిణాది భాషల్లో మంచి మార్కెట్ ఉంది. అలాంటి భారీ ప్రాజెక్టులో గోపీచంద్ ప్రతినాయకుడిగా నటిస్తే ఆయనకు ఇతర భాషల్లోనూ గుర్తింపు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం గోపీచంద్ ‘భరత వర్ష’, ‘సింగా’ చిత్రాల్లో నటిస్తున్నాడు. మరోవైపు సూర్య సినిమాలో మలయాళ నటి రియా షిబు కూడా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే సూర్య, గోపీచంద్ కాంబినేషన్‌పై వస్తున్న వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ క్రేజీ కాంబో నిజమవుతుందా? గోపీచంద్ మరోసారి విలన్‌గా తన నట విశ్వరూపాన్ని చూపిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
