Devavaram: శిలాశాసనాల సాక్షిగా.. వందల ఏళ్ల వైభవానికి నిలువుటద్దం ‘దేవవరం’!

darshi-devavaram-village-history-and-inscriptions

ప్రకాశం జిల్లా దర్శి మండలంలో దాగున్న ఒక చారిత్రక నిధి ‘దేవవరం’. మండల కేంద్రానికి ఉత్తరంగా పది కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ చిన్న గ్రామానికి వందల ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. ఆనాటి శాసనాలు, చారిత్రక ఆధారాల ప్రకారం దేవవరం విశేషాలు ఇవి:

గ్రామ నామ విశేషం

దేవ అంటే దేవుడు లేదా రాజు. వరం అంటే శ్రేష్ఠమైనది లేదా దేవతానుగ్రహం. పూర్వం రాజుల సంకల్పంతోనో, దైవానుగ్రహం వల్లో ఈ గ్రామం ఏర్పడటం వల్ల దీనికి ‘దేవవరం’ అనే పేరు స్థిరపడిందని చరిత్రకారులు భావిస్తున్నారు.

పద్నాలుగో శతాబ్దపు తొలి ఆధారం

దేవవరం పేరు చారిత్రక రికార్డుల్లో మొదటిసారిగా 14వ శతాబ్దంలో కనిపిస్తుంది. దర్శిలోని అచ్చెన్న చెరువు వద్ద మహామండలేశ్వర అస్నదేవ మహారాజు క్రీ.శ. 1317 (రాక్షస నామ సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి – క్రీ.శ. 1396) నాడు ఒక నాగ శాసనం వేయించారు. తన వంశ చరిత్రను వివరిస్తూ, పుణ్యం కోసం ఒక అగ్రహారాన్ని దానం చేసినట్లు ఆయన ఇందులో పేర్కొన్నారు. దర్శి, దేవవరం సరిహద్దుల మధ్య ‘సందుకట్టన’ ప్రాంతంలో అలిఖరాజు, మంత్రిరాజులకు ఈ అగ్రహారాన్ని ఇచ్చినట్లు ఉంది. ప్రస్తుతం దీనిని దర్శి సమీపంలోని తిమ్మాయపాలెం (మోటుపల్లి) గా గుర్తిస్తున్నారు. ఈ ఆధారాల బట్టి పద్నాల్గవ శతాబ్దానికే దేవవరం ఉనికిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

విజయనగర కాలం నాటి ‘దివ్వరం’ శాసనం

దేవవరం గ్రామంలోని ఒక బావి వద్ద 16వ శతాబ్దానికి చెందిన మరో కీలక శాసనం లభించింది. శాలివాహన శకం 1464 (ప్లవ నామ సంవత్సరం జ్యేష్ట బహుళ పాడ్యమి – 9 జూన్ 1541) నాటి ఈ శాసనాన్ని వరికూట్ల గోత్రీకుడైన శేసం వెంకటపతి వేయించారు. విజయనగర చక్రవర్తి అచ్యుతదేవరాయల పాలన ముగింపు సమయంలో ఈ శాసనం రూపుదిద్దుకుంది. గాదె లక్ష్మీనరసింహునికి పుణ్యంగా వెంకటపతి ఇక్కడ ఒక బావిని తవ్వించి ధర్మం చేశారు. ఈ శాసనంలో దేవవరాన్ని ‘దివ్వరం’ అని ప్రస్తావించారు. ఆ సమయంలో ఈ ప్రాంతానికి శ్రీ గుమ్మడప్ప రాఘవప్ప నాయుడు స్థానిక పాలకుడిగా ఉండేవారు. బావి ధర్మానికి సాక్షులుగా వెంకటాద్రి నాయుడు, గ్రామ కరణం గోపాలుని వెంకట నరసు, పెద్ద కాపులు చిప్పిరి వెంకటపతి, ఆంబటి బుచ్చిరెడ్డి సంతకాలు చేశారు.

నేటికీ సజీవ సాక్ష్యాలు

శాసనాల్లోని చారిత్రక మూలాలు నేటికీ ఇక్కడ సజీవంగా కనిపిస్తాయి. నాటి శాసనకర్త ‘శేసం’ వంశీయులు ప్రస్తుతం దేవవరం పక్కనే ‘శేషంవారిపాలెం’ పేరుతో నివసిస్తున్నారు. అలాగే సాక్షిగా సంతకం చేసిన కరణం ‘గోపాలుని’ వంశానికి చెందిన నియోగి బ్రాహ్మణులు ఇప్పటికీ ఇక్కడ ఉన్నారు. గ్రామంలో 13వ శతాబ్దానికి చెందిన వీరగల్లులతో పాటు ప్రాచీన విష్ణాలయం, శివాలయం, ఆంజనేయస్వామి గుడులు నాటి వైభవానికి అద్దం పడుతున్నాయి.

మీ శ్రీనివాస ప్రసాద్ తురిమెళ్ళ, దర్శి
9381143235