Bolisetty Satyanarayana: “ఆ బలం వాపుగా మారకముందే..” బొలిశెట్టి హెచ్చరిక!

bolisetty satyanarayana

అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో, సామాజిక కార్యకర్త బొలిశెట్టి సత్యనారాయణ ప్రభుత్వ పనితీరుపై, భవిష్యత్తు కార్యాచరణపై సోషల్ మీడియా వేదికగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి విజయం కోసం నిస్వార్థంగా పనిచేసిన ఒక శ్రేయోభిలాషిగా, కేవలం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూనే ప్రభుత్వం మున్ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సుతిమెత్తని హెచ్చరికలు చేశారు.

నియామకాల్లో సామాజిక సమతుల్యత ఏది?

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నలుగురు ప్రత్యేక ప్రతినిధులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ‘G.O. Rt. No.1333’పై బొలిశెట్టి స్పందించారు. ఈ నియామకాల్లో సామాజిక న్యాయం, సామాజిక అభివృద్ధి ఎంతవరకు జరిగిందనే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ, కూటమి ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాలకూ ప్రాధాన్యత దక్కాలన్న కోణాన్ని గుర్తుచేశారు. అలాగే, గతంలో తప్పులు చేసిన కొందరు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడంపై వస్తున్న విమర్శలను కూడా ఆయన ప్రస్తావించారు.

పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధే ముఖ్యం

‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (ఈఓడీబీ)లో భాగంగా మెగా డేటా సెంటర్లకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూనే, పర్యావరణ ప్రభావ అంచనా (EIA), సామాజిక ప్రభావ అంచనాలు వంటి కనీస నియమ నిబంధనలను విస్మరించకూడదని బొలిశెట్టి సూచించారు. పర్యావరణాన్ని పణంగా పెట్టకుండా చేసే అభివృద్ధే నిజమైన ప్రస్థానమని ఆయన అభిప్రాయపడ్డారు.

హోర్డింగ్‌లలో ‘కూటమి’ ఐక్యత కనిపించాలి!

రెండేళ్ల పాలనా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌లలో కూటమి ఐక్యత కొరవడిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. భాగస్వామ్య పార్టీల అధినేతల చిత్రాలు, కనీసం ఉమ్మడి లోగో కూడా కనిపించకపోవడం సరైన సంకేతం కాదన్నారు. “ఏరు దాటాక తెప్ప తగలేసే” ధోరణి ఎవరికీ మంచిది కాదని, క్షేత్రస్థాయిలో ప్రజలు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చే నివేదికలను బట్టి ప్రభుత్వం తన వ్యూహాలను సరిచేసుకోవాలని హితవు పలికారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టండి!

వచ్చే సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందనే ధీమాతో కాకుండా, త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైనే కూటమి దృష్టి పెట్టాలని బొలిశెట్టి సూచించారు. ప్రజలు మరో ప్రత్యామ్నాయం వైపు చూసే పరిస్థితి రాకముందే ప్రజా మనోభావాలను గౌరవించాలన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడూ తమ సొంత బలంతో కాకుండా, అధికార పక్షం చేసే పొరపాట్ల వల్లే బలపడతాయనే రాజకీయాన్ని గ్రహించాలని కోరారు.

విశ్వాసమే బలం.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం!

2024 ఎన్నికల్లో సాధించిన భారీ మెజారిటీ కేవలం ఒకే పార్టీ బలం కాదని, అది మూడు పార్టీల కూటమిపై ప్రజలు ఉంచిన ఉమ్మడి విశ్వాసానికి ప్రతిఫలమని బొలిశెట్టి స్పష్టం చేశారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటేనే అది నిజమైన బలమని, నిర్లక్ష్యం చేస్తే ఆ బలం కాస్తా వాపుగా మారే ప్రమాదం ఉందని ముందుజాగ్రత్తగా హెచ్చరించారు. రాబోయే 15 నెలల పాటు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మరో పదిహేనేళ్ల పాటు ప్రజల మద్దతు పొందేలా ప్రభుత్వం అడుగులు వేయాలని కూటమి శ్రేయోభిలాషిగా తెలుపుతున్నానంటూ బొలిశెట్టి సత్యనారాయణ ట్విట్టర్‌ వేదికగా ప్రకటన విడుదల చేశారు.