Niranjan: పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత

pawan-kalyan-young-fan-niranjan-passes-away

హనుమకొండ: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అత్యంత ఆప్తుడైన చిన్నారి నిరంజన్(17) మరణ వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, మృత్యువుతో పోరాడిన ఈ చిన్నారి బుధవారం తుదిశ్వాస విడిచాడు. నిరంజన్ మరణవార్త తెలుసుకున్న జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.

ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకం
హనుమకొండకు చెందిన నిరంజన్ అనారోగ్యం గురించి తెలుసుకున్న పవన్ కల్యాణ్, స్వయంగా ఆ చిన్నారి ఇంటికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిరంజన్‌తో పవన్ కళ్యాణ్ ఎంతో ఆప్యాయంగా గడిపారు. మంచంపై ఉన్న నిరంజన్ ముఖంలో నవ్వులు పూయిస్తూ, వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తన అభిమాన హీరో తన పక్కనే కూర్చొని మాట్లాడటంతో నిరంజన్ ఎంతో మురిసిపోయాడు. ఆ సమయంలో చిన్నారి కుటుంబానికి పవన్ కల్యాణ్ ధైర్యం చెప్పడమే కాకుండా, ఆర్థికంగా, వైద్య పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

విషాదంలో కుటుంబం, పవన్ అభిమానులు
జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి నిరంజన్‌ను కాపాడుకునేందుకు వైద్యులు, కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎంతో చురుగ్గా ఉంటూ, పవన్ కల్యాణ్ అంటే ఎంతో ప్రాణమిచ్చే ఈ చిన్నారి లోకాన్ని విడిచి వెళ్లడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైనికులు నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.