కన్నీళ్లు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ నిర్ణయం.. కూతురి కోసం జీవితంలో చెప్పులే వదిలేశారు!

Vijay Antony

Vijay Antony

Vijay Antony: సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నటుడిగా బిజీ అయిన విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ముఖ్యంగా ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగులో భారీ గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ, కొన్ని చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. అయినా ఏమాత్రం విరామం లేకుండా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ప్రీతి అస్రానితో కలిసి ‘అప్పా కుట్టి’ సినిమాలో నటించారు. ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ఆడియో వేడుకలో విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా తన భర్త జీవితానికి సంబంధించిన ఓ హృదయవిదారక విషయాన్ని వెల్లడించారు. కొన్నేళ్లుగా విజయ్ ఆంటోనీ చెప్పులు ధరించడం లేదని, ఎక్కడికి వెళ్లినా చెప్పులు లేకుండానే వెళ్తున్నారని తెలిపారు. ఇందుకు తమ కుమార్తె మీరా మరణమే కారణమని చెప్పారు.

మూడేళ్ల క్రితం మీరా ఆత్మహత్య చేసుకుని మరణించడం విజయ్ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. అప్పటి నుంచి మీరా జ్ఞాపకాలతోనే విజయ్ జీవిస్తున్నారని ఫాతిమా వెల్లడించారు. తమ కుమార్తె ఉపయోగించిన వస్తువులన్నింటినీ ఇప్పటికీ ఆమె గదిలో భద్రంగా ఉంచినట్లు తెలిపారు. మీరా కోసం కొనుగోలు చేసి, ఆమె ఉపయోగించకుండానే మిగిలిపోయిన చెప్పులను చూసిన విజయ్.. ఇక జీవితంలో చెప్పులు ధరించకూడదని నిర్ణయించుకున్నారని భావోద్వేగంగా చెప్పారు.

అంతేకాదు, గతంలో ఖరీదైన వాచ్ ధరించే విజయ్ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి, మీరా తనకు కొనిచ్చిన రూ.4 వేల విలువైన వాచ్‌నే ధరిస్తున్నారని ఫాతిమా తెలిపారు. కూతురిపై విజయ్‌కు ఉన్న ప్రేమ, ఆమె జ్ఞాపకాలను ఎంతగా గుండెల్లో దాచుకున్నారో ఈ విషయాలు తెలియజేస్తున్నాయి.

తండ్రి, కూతురు మధ్య అనుబంధం ప్రధాన ఇతివృత్తంగా ‘అప్పా కుట్టి’ తెరకెక్కింది. ఈ సినిమా నేపథ్యంలో జరిగిన ఆడియో వేడుకలో ఫాతిమా మీరా గురించి మాట్లాడుతుండగా భావోద్వేగానికి గురయ్యారు. విజయ్, ఫాతిమా దంపతులకు మరో కుమార్తె లారా కూడా ఉన్నారు. మీరా జ్ఞాపకాలతో విజయ్ తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.