టెన్ పర్సంట్ కమీషన్ వివాదం
డిప్యూటీ సీఎం భట్టి భార్యపై గవర్నర్‌కు ఫిర్యాదు
రిటైర్డ్ ఉద్యోగిని ఆరోపణల ఆధారంగా..
ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త
మినిట్ 2 మినిట్, హైదరాబాద్(ఆగస్ట్ 13): తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని భట్టిపై ఇటీవల తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిల విడుదలకు ఆమె కమీషన్ డిమాండ్ చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అంబర్‌పేటకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త కరుపోతుల రేవంత్, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు ఫిర్యాదు చేశారు. నిష్పక్షపాతంగా ఈ ఆరోపణలపై విచారణ జరిపించి, పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోరుతూ లేఖ రాశారు.
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆగస్టు 9న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో, వైద్య ఆరోగ్య శాఖ రిటైర్డ్ ఉద్యోగిని, INTUC అనుబంధ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి S.K. ప్రసన్నకుమారి ఆరోపణలు చేశారు. తనకు రావాల్సిన రూ. 40 లక్షల పదవీ విరమణ బకాయిలను క్లియర్ చేయడం కోసం 10 శాతం కమీషన్ (రూ. 4 లక్షలు) ఇవ్వాలని డిమాండ్ చేశారని మీడియా ముందు బయటపెట్టారు. ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే సుమారు రూ. 120 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఫైళ్లు ముందుకు కదలాలన్నా బిల్లులు మంజూరు కావాలన్నా 6 శాతం నుంచి 10 శాతం వరకు కమీషన్లు అడుగుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు పత్రికల్లో వార్తలు వచ్చాయని లాయర్ కరుపోతుల రేవంత్ గవర్నర్‌కు వివరించారు.
