Japan Cricket: గ్లోబల్ స్పోర్ట్స్ వేదికపై జపాన్ అనగానే అందరికీ ముందుగా మార్షల్ ఆర్ట్స్, ఫుట్‌బాల్ లేదా బేస్‌బాల్ గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు అక్కడ ‘జెంటల్‌మెన్ గేమ్’ క్రికెట్ హవా మొదలుకాబోతోంది! జపాన్‌లో క్షేత్రస్థాయి (రూట్‌లెవెల్) నుంచి క్రికెట్ పునాదులను బలోపేతం చేసేందుకు ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా టోక్యోలోని ప్రతిష్ఠాత్మక ‘ద బ్రిటిష్ స్కూల్ ఇన్ టోక్యో’ (BST) తో డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్ క్రికెట్ అసోసియేషన్ (JCA) తో కలిసి సంయుక్తంగా చేపడుతున్న ఈ క్రీడా యజ్ఞం, అక్కడి యువతను క్రికెట్ వైపు అడుగులు వేయించడానికి బలమైన పునాది వేస్తోంది.
మాజీ కెప్టెన్ అంజూ జైన్ స్పెషల్ క్లాసెస్
ఈ ప్రత్యేక భాగస్వామ్యంలో భాగంగా భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ అసిస్టెంట్ కోచ్ అంజూ జైన్ స్వయంగా టోక్యోకు వెళ్లి రంగంలోకి దిగారు. బ్రిటిష్ స్కూల్‌లోని ప్రైమరీ, సెకండరీ తరగతుల విద్యార్థులకు ఆటకు సంబంధించిన మెళకువలు, బ్యాటింగ్-బౌలింగ్ ప్రాథమిక అంశాలపై ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఒక అంతర్జాతీయ దిగ్గజం తమ పాఠశాలకు వచ్చి కోచింగ్ ఇవ్వడంతో విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ నిపుణులైన కోచ్‌లను, స్టార్ ఆటగాళ్లను జపాన్‌కు పంపి ప్రత్యేక శిక్షణా శిబిరాలు, సాంకేతిక మార్గదర్శకాలతో పాటు ఉపాధ్యాయులకు కోచింగ్ ఇచ్చే ప్రోగ్రామ్‌లు నిర్వహించనుంది.
ఒలింపిక్స్, ఆసియా క్రీడల జోరు..
ఆసియా క్రీడల్లో (ఐచి-నాగోయా 2026) క్రికెట్ తిరిగి చేరడం, అలాగే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పతకాల ఈవెంట్‌గా క్రికెట్‌ను ఖరారు చేయడంతో జపాన్ ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో భారత్-జపాన్ జట్ల మధ్య మహిళల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్, అలాగే పురుషుల సుజుకీ కప్ టీ20 టోర్నీ వంటి ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లు తోడవ్వడంతో దేశంలో క్రీడా వాతావరణం మరింత వేడెక్కింది. అంతేకాక జపాన్ స్టార్ బౌలర్ అహిల్యా చందేల్, WPL 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్ బౌలర్‌గా వ్యవహరించడం ద్వారా జపాన్ క్రీడాకారులకు ఐపీఎల్ వంటి ప్రతిష్ఠాత్మక లీగ్‌లతో ఇప్పటికే అనుబంధం ఏర్పడింది.
గ్లోబల్ విజన్: సరిహద్దులు దాటుతున్న ఐపీఎల్ బ్రాండ్ సామర్థ్యం
జపాన్ అత్యంత సంభావ్యత కలిగిన ఒక సరికొత్త క్రికెట్ మార్కెట్ అని, ఈ ఒప్పందం ద్వారా ఉన్నత స్థాయి శిక్షణా ప్రమాణాలను యువ క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తున్నామని ఢిల్లీ క్యాపిటల్స్ సీఈవో సునీల్ గుప్తా సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు, “ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రీడ అయిన క్రికెట్ వివిధ సంస్కృతులను సమైక్యపరుస్తుందని, డీసీతో ఒప్పందం తమ పాఠశాల విద్యార్థుల లక్ష్యాలకు కొత్త ఊపిరి పోస్తుందని” బ్రిటిష్ స్కూల్ ప్రిన్సిపల్ ఇయాన్ క్లేటన్ స్పష్టం చేశారు. కేవలం భారత్‌కే పరిమితం కాకుండా ప్రపంచ నలుమూలలా క్రికెట్ బీజాలు నాటుతూ ఐపీఎల్ ఫ్రాంచైజీలు గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా మారుతున్న తీరుకు డీసీ వేసిన ఈ అడుగు నిదర్శనంగా నిలుస్తోంది!
