‘చాటింగ్’ నుంచి ‘చీటింగ్’ దాకా.. డేటింగ్ యాప్ మోసానికి బలైన యువకుడు!

Dating App

Dating App

Dating App:  డేటింగ్ యాప్‌ ద్వారా పరిచయమైన ఓ యువతి.. అమాయక యువకుడిని హనీట్రాప్‌తో దారుణంగా మోసగించిన సంఘటన రాజధాని నగరంలో తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన హేమంత్ అనే యువకుడికి ప్రముఖ డేటింగ్ యాప్ ‘క్వాక్ క్వాక్’ ద్వారా ఓ యువతి పరిచయమైంది. కొద్దిరోజుల పాటు చాటింగ్ చేసుకున్న వీరిద్దరూ నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు.

అక్కడ కాసేపు సరదాగా గడిపిన తర్వాత అసలు డ్రామా మొదలైంది. బిల్లు చెల్లించే సమయానికి సదరు యువతి, పబ్ మేనేజ్‌మెంట్‌తో ముందస్తుగా కుమ్మక్కై తన పథకాన్ని అమలు చేసింది. ఫేక్ పేమెంట్ ట్రాన్సాక్షన్ చూపిస్తూ హేమంత్‌ను రూ.29 వేల భారీ బిల్లు చెల్లించేలా బోల్తా కొట్టించింది. తీరా డబ్బులు కట్టిన తర్వాత ఆ యువతితో పాటు పబ్ సిబ్బంది కూడా తనకు హ్యాండ్ ఇవ్వడంతో మోసపోయానని గ్రహించిన హేమంత్ తేరుకుని వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు క్వాక్ క్వాక్ డేటింగ్ యాప్ ప్రొఫైల్ వివరాలు, పబ్ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ముమ్మరంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ హనీట్రాప్ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలియని యాప్‌లలో పరిచయమయ్యే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.