రెడ్ బుల్‌కు మరో ఛాన్స్.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే!

Red Bull

Red Bull

Red Bull: ప్రముఖ పానీయాల తయారీ సంస్థ రెడ్ బుల్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. రెడ్ బుల్ క్యాన్లపై ‘ఎనర్జీ డ్రింక్’ అనే లేబుల్‌ను తొలగించాలంటూ భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) జారీ చేసిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జూన్ 30న ఆహార భద్రత సంస్థ ఇచ్చిన ఈ ఆదేశాలు చెల్లుబాటు కావని స్పష్టం చేస్తూ హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.

విచారణ సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వ్యవహరించిన తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. రెడ్ బుల్ సంస్థకు తమ అభిప్రాయాలు, వివరణ తెలుపుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం గుర్తించింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ముందస్తు నోటీసులు లేకుండా ఆకస్మికంగా నిబంధనలు విధిస్తే సంస్థ పెట్టుబడులు, వాణిజ్య ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని రెడ్ బుల్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

భారత్‌లో 2002 సంవత్సరం నుంచే తాము ‘ఎనర్జీ డ్రింక్’ అనే లేబుల్‌తో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నామని, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా లేబుల్ మార్చమనడం సరైంది కాదని కంపెనీ వాదించింది. ఈ వాదనలతో ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా తీర్పుతో రెడ్ బుల్ యాజమాన్యానికి పెద్ద ఊరట లభించినట్లయింది.