ఉచిత ప్రయాణమా.. ఉచిత అవమానమా? మహిళ పట్ల ఆర్‌టీసీ డ్రైవర్ హద్దుమీరిన ప్రవర్తన

RTC Driver

RTC Driver

RTC Driver: తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రశంసలు అందుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో కొందరు ఆర్‌టీసీ సిబ్బంది ప్రవర్తన మాత్రం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. మహిళా ప్రయాణికుల పట్ల కొందరు వాహన చోదకులు, కండక్టర్లు అహంకారంతో, దురుసుగా వ్యవహరిస్తున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా పరిధిలో ఆర్‌టీసీ బస్సు డ్రైవర్ ఓ మహిళ పట్ల నోటికొచ్చినట్లు మాట్లాడిన ఘటన స్థానికంగా ఆందోళనకు దారితీసింది.

బత్తులపల్లి గ్రామంలో బస్సు ఎక్కే క్రమంలో ఈ గొడవ మొదలైంది. బాధితురాలు వాహనం ఎక్కుతున్న సమయంలో డ్రైవర్ ఆమెపై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ తీవ్రంగా అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉచితంగా ప్రయాణిస్తున్నారనే నెపంతో “మూసుకుని బస్సు ఎక్కు” అంటూ హేళనగా మాట్లాడాడని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బస్సు డోర్ వేయాలని మాత్రమే తాను సూచించానని, దానికి కోపోద్రిక్తుడైన డ్రైవర్ తనతో హద్దుమీరి ప్రవర్తించాడని వాపోయింది.

తనతో దారుణంగా ప్రవర్తించిన డ్రైవర్ తీరును బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలపడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఆగ్రహానికి గురైన ఆమె బంధువులు సదరు డ్రైవర్‌పై దాడికి దిగడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి డ్రైవర్‌ను విచారిస్తున్నారు. ప్రయాణికులకు సేవలు అందించాల్సిన సిబ్బంది ఇలా అహంకారంతో ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.