Kavitha KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వేడి రాజేసాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ చీఫ్ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని కేసీఆర్ చెప్పడం వల్లే ప్రజా సమస్యలు తమ దాకా రాలేదంటూ కేటీఆర్ మాట్లాడటాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఎక్స్ వేదికగా స్పందించిన కవిత, పార్టీలో జరిగిన వైఫల్యాలు, చేతగానితనాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మోపడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
గుంటనక్క మైండ్ గేమ్‌లో పడిపోయి, బీఆర్ఎస్కు గోతి తవ్వుతూ పెద్ద మనిషిని తప్పుబడుతున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఒక అవినీతి వ్యక్తిని విమర్శించినందుకు కొద్ది గంటల్లోనే తనను సస్పెండ్ చేశారని కవిత గుర్తుచేశారు. ఇప్పుడు కేటీఆర్ అదే వ్యక్తితో కలిసి మెలుగుతూ, కేసీఆర్ నిర్ణయాల వల్లే పార్టీ నష్టపోయిందని అనడం పార్టీ వ్యతిరేక చర్య కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను, ఆయన విధానపరమైన నిర్ణయాలను బహిరంగంగా విమర్శించడం క్రమశిక్షణా రాహిత్యమేనని తేల్చి చెప్పారు.
ఫామ్‌హౌస్‌లు, అక్రమ అనుమతులు, ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చిన నజరానాలు, క్విడ్ ప్రో కో దందాలతో బీఆర్ఎస్ను పాతాళంలోకి నెట్టింది కేటీఆర్ కాదా అంటూ ఘాటుగా నిలదీశారు. తాను ఆధారాలు లేకుండా ఏదీ మాట్లాడనని, తగిన సాక్ష్యాధారాలతో అన్ని విషయాలు బయటపెడతానని స్పష్టం చేశారు. “నాతో పెట్టుకోవద్దు” అంటూ కవిత కేటీఆర్‌ను హెచ్చరించడం ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో పెద్ద చర్చకు దారితీసింది.
