పోలీసుల లాఠీఛార్జ్, ఇంటర్నెట్ బంద్.. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్.. ఎందుకంటే?

CEC Resignation

CEC Resignation

CEC Resignation: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుకు నిరసనగా విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమం రణరంగాన్ని తలపించింది. పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ జంతర్ మంతర్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పోలీసుల అనుమతి లేదంటూ ఆ పరిసర ప్రాంతాలను అష్టదిగ్బంధం చేశారు. 163 సెక్షన్ విధించడమే కాకుండా, దాదాపు 1.5 కిలోమీటర్ల మేర ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ టెలికాం కంపెనీలను ఆదేశించారు. భద్రతా కారణాల రీత్యా రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, జన్ పథ్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ వంటి 12 కీలక మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేశారు.

ఈ భారీ ఆంక్షలను సైతం దాటుకుని విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు జంతర్ మంతర్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు. సిపిఎం నాయకురాలు బృందా కారత్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంపీ బేబీ, సామాజికవేత్త యోగేంద్ర యాదవ్, బిఎస్ఎస్ నేత నేహా భోరా, ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, సంజీవ్ ఝా, అనురాగ్ ధండా, అతిథి, సంజయ్ సింగ్ సహా 500 మందికి పైగా నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ముంబైలోనూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో శివాజీ పార్క్ వద్ద చేపట్టిన నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు ఆపేది లేదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్ స్పష్టం చేశారు. విపక్షాల నిరసనలతో ఢిల్లీ, ముంబై నగరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.