LK Advani: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చెస్ట్ ఇన్ఫెక్షన్, వృద్ధాప్య సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో ఆయన ఆసుపత్రిలో చేరగా, ప్రొఫెషనల్ పల్మనరీ డిపార్ట్మెంట్ వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో 98 ఏళ్ల అద్వానీకి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ ఏడాది ఆయన ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారి. మే నెలలో కూడా వృద్ధాప్య సమస్యలతో అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. తొమ్మిది రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ, అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రభుత్వం అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో మోదీ ఆయనను కలవడం విశేషం.
1927లో కరాచీలో జన్మించిన అద్వానీ, 1947 దేశ విభజన సమయంలో భారత్కు వచ్చారు. దేశ రాజకీయాల్లో చెరిపేయలేని ముద్ర వేసిన ఆయన సేవలకు గాను 2024 మార్చిలో దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. అద్వానీ త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
