Cyber Harassment: సోషల్ మీడియా యుగంలో ట్రోలింగ్ అనేది కేవలం వ్యంగ్య వ్యాఖ్యలు, విమర్శలకే పరిమితం కాకుండా వ్యక్తిగత జీవితాలను చిన్నాభిన్నం చేసే దారుణ స్థాయికి దిగజారుతోంది. తాజాగా కొడంగల్‌కు చెందిన ‘నటనమ్ స్టార్’ యూ శేఖర్‌ను లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు సాగించిన సైబర్ వేధింపులు విస్మయానికి గురిచేస్తున్నాయి.
ఆయన రెండు ఫోన్ నంబర్లను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడమే కాకుండా, విపరీతమైన మనస్తత్వంతో ఆయన అడ్రస్‌ను ఉపయోగించి ప్రముఖ ఈ-కామర్స్ ఆన్లైన్ షాపింగ్ యాప్‌లలో ‘క్యాష్ ఆన్ డెలివరీ’ (COD) ఆప్షన్ ద్వారా ఎడాపెడా వస్తువులను ఆర్డర్ చేయడం మొదలుపెట్టారు.
దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ డెలివరీ సంస్థల ప్రతినిధులు కొరియర్ పార్సిళ్లతో ఆయన ఇంటి ముందుకు వచ్చి నిలబడటంతో శేఖర్ తీవ్ర మనోవేదనకు, అయోమయానికి గురవుతున్నారు. ఈ తప్పుడు ఆర్డర్ల వేధింపులతో విసిగిపోయిన శేఖర్ చివరికి సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేస్తూ తాను ఎలాంటి ఆన్లైన్ ఆర్డర్లు పెట్టలేదని స్పష్టత ఇచ్చుకోవాల్సి వచ్చింది.
చట్టపరమైన చర్యలు అవసరం
డిజిటల్ స్వేచ్ఛను ఆసరాగా చేసుకుని ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులను, ప్రశాంతతను భంగపరిచేలా సాగుతున్న ఇలాంటి చర్యలు ముమ్మాటికీ నేరమే. ఒక వ్యక్తి ఫోన్ నంబర్, ఇంటి చిరునామాను దుర్వినియోగం చేస్తూ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను సైబర్ ఆయుధాలుగా మార్చుకోవడం డిజిటల్ భద్రతలోని లోపాలను, సైబర్ అబ్యూజ్ తీవ్రతను తేటతెల్లం చేస్తోంది.
ఈ-కామర్స్ సంస్థలు కూడా ఇలాంటి అనుమానాస్పద బల్క్ ఆర్డర్లను అరికట్టేలా ‘ఓటీపీ వెరిఫికేషన్’ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వ్యక్తిగత వివరాలను దుర్వినియోగం చేస్తూ సైబర్ వేధింపులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపకపోతే, రేపు ఏ సామాన్యుడైనా ఈ రకమైన ఆధునిక వేధింపులకు బాధితుడిగా మారే ప్రమాదం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
