Hyundai Zaheerabad: ప్రముఖ గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం ‘హ్యుందాయ్ మోటార్స్’ రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం ఎ రేవంత్ రెడ్డితో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్ గో చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రత్యేకంగా సమావేశమైంది.
ఈ భేటీ సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని ‘నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్’ (NIMZ) పరిధిలో రూ. 8,528 కోట్ల భారీ పెట్టుబడితో తమ అంతర్జాతీయ స్థాయి రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D) ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు హ్యుందాయ్ ప్రతినిధులు సీఎంకు వెల్లడించారు. ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని యువతకు సుమారు 4,276 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు.
అత్యాధునిక ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్, పైలట్ ప్రొడక్షన్ లైన్, ప్రోటోటైపింగ్ ప్లాట్ఫామ్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. హ్యుందాయ్ ప్రతినిధుల విజ్ఞప్తులపై సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సానుకూలంగా స్పందించారు. ఈ ఆర్అండ్డీ కేంద్రానికి అవసరమైన అన్ని రకాల అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో వేగంగా మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
