Asian Games: ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు పసిడి పంట పండిస్తున్నారు. మైదానంలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ విభిన్న క్రీడా విభాగాల్లో బంగారు పతకాలను కైవసం చేసుకుంటూ దేశ ఘనకీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. శనివారం నాటి మ్యాచ్‌లలో క్రికెట్, హాకీ, రెజ్లింగ్‌లలో వరుస విజయాలు సాధించి ఒకే రోజు సరికొత్త చరిత్రను లిఖించారు.
పాకిస్తాన్‌పై విక్టరీ.. క్రికెట్లో స్వర్ణం
పురుషుల క్రికెట్ ఫైనల్ సమరంలో దాయాది పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత జట్టు పసిడి పతకాన్ని ముద్దాడింది. ఆరంభంలో అభిషేక్ శర్మ (28 బంతుల్లో 61) ధాటిగా ఆడగా, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (22 బంతుల్లో 51 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి తడబడి విఫలమైంది. హసన్ నవాజ్ (96) ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా మిగతా వారు సహకరించకపోవడంతో పాక్ ఓటమి పాలైంది.
మెన్స్ హాకీ జట్టుకు బంగారుపతకం
మరోవైపు పురుషుల హాకీ ఫైనల్ పోరులో భారత జట్టు మలేషియాను 5-1 గోల్స్ తేడాతో ఘోరంగా ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆరంభం నుంచే పక్కా వ్యూహాలతో చెలరేగిన భారత ఆటగాళ్లు మలేషియాపై పూర్తి ఆధిక్యత ప్రదర్శించారు. ఒకే ఆసియాడ్‌లో అటు మహిళల జట్టు, ఇటు పురుషుల జట్టు రెండూ పసిడి పతకాలు గెలవడం భారత హాకీ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం.
రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్ పసిడి పంచ్
పురుషుల ఫ్రీస్టైల్ 57 కిలోల రెజ్లింగ్ విభాగంలో భారత స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ అద్భుత ప్రదర్శనతో పసిడి పట్టు పట్టాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో ఉత్తర కొరియా రెజ్లర్‌పై 11-7 పాయింట్ల తేడాతో సంచలన విజయం సాధించాడు. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత స్వర్ణ పతకాల సంఖ్య 20కి చేరి మెడల్స్ టేబుల్లో టాప్-5లో కొనసాగుతోంది.
