డాలర్‌కు ఆర్బీఐ బిగ్ షాక్.. పతనం నుంచి ఫుల్ జోష్‌లో రూపాయి

Rupee Surge

Rupee Surge

Rupee Surge: దేశీయ కరెన్సీ రూపాయి విలువ గత కొంతకాలంగా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయి కనిష్ఠమైన 97 మార్కుకు సమీపిస్తూ ఆందోళన కలిగిస్తోంది. మార్కెట్లో సాగుతున్న ఊహాజనిత (స్పెక్యులేటివ్) లావాదేవీల వల్ల రూపాయి వేగంగా పడిపోతుండటంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రంగంలోకి దిగింది. రూపాయి క్షీణతను అడ్డుకోవడానికి, మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడేందుకు 2013 నాటి పరిస్థితుల తర్వాత అత్యంత కఠినమైన నిర్ణయాలను ప్రకటించింది. ఈ అనూహ్య చర్యలతో సోమవారం ఫారెక్స్ మార్కెట్ ప్రారంభంలోనే రూపాయి ఒక శాతానికి పైగా లాభపడి, డాలర్‌తో పోలిస్తే 95.76 వద్ద బలమైన ట్రేడింగ్‌ను నమోదు చేసింది.

ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ప్రత్యేక విండో

రూపాయిపై పడుతున్న తీవ్ర ఒత్తిడిని తగ్గించడానికి ఆర్బీఐ శనివారం ఒక కీలక ప్రకటన చేసింది. మన దేశపు దిగుమతుల బిల్లులో సింహభాగం ఆక్రమించే ప్రభుత్వ రంగ చమురు సంస్థల డాలర్ అవసరాల కోసం ఒక ప్రత్యేక విండోను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా చమురు కంపెనీలు బహిరంగ మార్కెట్లో ఒకేసారి పెద్దమొత్తంలో డాలర్లను కొనుగోలు చేయడం వల్ల డాలర్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగి రూపాయి విలువ దెబ్బతింటుంది. ఈ ప్రత్యేక విండో ఏర్పాటు చేయడం ద్వారా బహిరంగ మార్కెట్‌పై భారం తగ్గి, ఫారెన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో రూపాయి విలువ స్థిరపడటానికి తక్షణ ఊరట లభించింది.

ఫారెక్స్ డెరివేటివ్ లావాదేవీలపై కఠిన నిబంధనలు

కేవలం తక్షణ చర్యలకే పరిమితం కాకుండా, అక్టోబర్ ఆరంభం నుంచే ఆర్బీఐ పలు రక్షణ విధానాలను అమల్లోకి తెచ్చింది. అన్‌హెడ్జ్‌డ్ ఫారెక్స్ డెరివేటివ్ లావాదేవీల పరిమితిని ఏకంగా 100 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్లకు తగ్గించింది. దీంతో పాటు ‘ఫారెన్ ఎక్స్ఛేంజ్ రిస్క్ రిజర్వ్’ (FERR) అనే నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిప్రకారం 2 మిలియన్ డాలర్లు దాటే ఫారెక్స్ డెరివేటివ్ కాంట్రాక్టులపై 20 శాతం మొత్తాన్ని నగదు రూపంలో ఆర్బీఐ వద్ద రిజర్వ్‌గా ఉంచాలని అధీకృత డీలర్లను ఆదేశించింది. అలాగే, ఒకసారి రద్దు చేసిన కాంట్రాక్టులను మళ్లీ రీబుక్ చేయడాన్ని నిషేధించి, కేవలం మెచ్యూరిటీ సమయంలో రోలోవర్ చేసుకునేందుకు మాత్రమే వెసులుబాటు కల్పించింది.

వడ్డీ రేట్ల పెంపు.. ఆర్బీఐ కఠిన సంకేతాలు

ఇటీవల బుధవారం నాటి సమీక్షలో వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ, రూపాయి రక్షణ కోసం ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడబోమని స్పష్టమైన సంకేతాలనిచ్చింది. వరుసగా ఇన్ని నియంత్రణ చర్యలు తీసుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని ‘సోషియేట్ జనరల్’ ఎమర్జింగ్ ఆసియా స్ట్రాటజిస్ట్ గాల్విన్ చియా అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ ఏ క్షణంలోనూ 97 స్థాయిని దాటకుండా చూడాలనే పట్టుదలతో ఆర్బీఐ ఉందనడానికి ఈ నిర్ణయాలే నిదర్శనం. ఈ కఠిన విధానాల వల్ల మార్కెట్లో అనాలోచిత స్పెక్యులేషన్‌కు అడ్డుకట్ట పడటంతో పాటు పారదర్శకత, క్రమశిక్షణ పెరిగి రూపాయి మరింత పుంజుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.