Maya Rajeshwaran: భారత టెన్నిస్ ప్రపంచంలో ఒక కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. 17 ఏళ్ల తమిళనాడు యువ సంచలనం మాయా రాజేశ్వరన్ రేవతి, సానియా మీర్జా పేరు మీద రెండు దశాబ్దాలుగా ఉన్న సుదీర్ఘ రికార్డును చెరిపివేస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పింది. క్వాలిఫయర్‌గా టోర్నీలో అడుగుపెట్టి, ఏకంగా సింగిల్స్, డబుల్స్ రెండింటిలోనూ ట్రోఫీలను ముద్దాడి ‘డబుల్ ధమాకా’ విజయాన్ని నమోదు చేసింది.
లాగోస్ కోర్టులో అద్భుతం
నైజీరియాలో జరిగిన ITF W35 లాగోస్ ఓపెన్ టోర్నమెంట్‌లో మాయా రాజేశ్వరన్ అసాధారణ ప్రతిభ కనబరిచింది. క్వాలిఫయింగ్ రౌండ్ల నుంచి మెయిన్ డ్రా వరకు ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, టోర్నీ పొడవునా ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరింది. ఆఖరి పోరులో స్పెయిన్‌కు చెందిన సీనియర్ క్రీడాకారిణి సెలియా సెర్వినో రూజ్‌ను 6-4, 6-2 తేడాతో చిత్తు చేసి తొలి ప్రొఫెషనల్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా, ఉక్రెయిన్ క్రీడాకారిణి యెలిజవేటా కోట్లియార్‌తో జతకట్టి డబుల్స్ విజేతగా నిలిచి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పింది.
22 ఏళ్ల సానియా రికార్డు బ్రేక్..
2002లో కేవలం 15 ఏళ్ల వయస్సులో సానియా మీర్జా ప్రొఫెషనల్ ITF టైటిల్ గెలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. ఆ తర్వాత అతి పిన్న వయసులో W35 స్థాయి అంతర్జాతీయ టోర్నీని గెలుచుకున్న భారతీయ మహిళా ప్లేయర్‌గా మాయా నిలిచింది. దీంతో 22 ఏళ్ల నాటి చరిత్ర పునరావృతమైంది. అయితే, సానియా మీర్జాతో తనను పోల్చడంపై మాయా చాలా సున్నితంగా స్పందించింది. “సానియా ఒక దిగ్గజం, నా ఆరాధ్య దైవం. ఆమె సాధించిన విజయాలతో నన్ను పోల్చలేం. భారతదేశంలో మహిళల టెన్నిస్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చింది ఆమే. నేను ఇప్పటికీ ఆమె పాడ్‌కాస్ట్‌లు, ఇంటర్వ్యూలు వింటూ స్ఫూర్తి పొందుతాను” అని తన వినయాన్ని ప్రదర్శించింది.
’25 నిమిషాల్లో ఓడిపోకూడదు’..
ఈ టోర్నీ తొలి రౌండ్‌లోనే టాప్ సీడ్ క్రీడాకారిణితో తలపడిన సమయంలో మాయా చూపిన పట్టుదల ఆకట్టుకుంది. ఆ మ్యాచ్‌లోని మొదటి సెట్‌లో ఒకానొక దశలో 0-5తో ఘోరంగా వెనుకబడింది. ఆ క్షణంలో కోర్టులో ఉన్న గడియారం వైపు చూసిన మాయా, ‘కేవలం 25 నిమిషాల్లో ఒక సెట్‌ను కోల్పోకూడదు’ అని మనసులో బలంగా అనుకుంది. ఆ క్షణం నుండి పాయింట్ పాయింట్‌కు పోరాడి, వరుసగా 7 గేమ్‌లు గెలిచి ఆ సెట్‌ను 7-5తో తన సొంతం చేసుకుంది. ఆ తర్వాత మ్యాచ్‌ను కైవసం చేసుకుని టోర్నీ విజేతగా నిలిచేందుకు పునాది వేసుకుంది.
నాదల్ అకాడమీ శిక్షణ..
మాయా రాజేశ్వరన్ ఎదుగుదల వెనుక కఠినమైన శిక్షణ ఉంది. గతంలో స్పెయిన్‌లోని ప్రసిద్ధ రఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందిన ఈ చిన్నది, స్వయంగా నాదల్‌తో పాటు ఆయన మాజీ కోచ్ టోనీ నాదల్‌తో సమయం గడిపి ఎన్నో విలువైన మెళకువలు నేర్చుకుంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని ‘ఎలైట్ టెన్నిస్ సెంటర్’లో శిక్షణ పొందుతూ తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకుంటోంది. ఈ W35 విజయం తన సుదీర్ఘ కెరీర్‌కు ఒక మంచి ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకుని ప్రపంచ టెన్నిస్‌లో భారత్ జెండాను రెపరెపలాడిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది.
