“కరోనాను మించిన పెను విపత్తు ఎల్ నినో”.. వేసవిలో పంటలు వేయొద్దన్న సీఎం రేవంత్ రెడ్డి!

El Nino

El Nino

El Nino:  రోజురోజుకూ తీవ్రమవుతున్న ఎల్ నినో ఎఫెక్ట్ అనేది కరోనా మహమ్మారిని మించిన పెను విపత్తుగా మారబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సచివాలయంలో మంత్రులతో ఎల్ నినో పరిస్థితులపై గురువారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సంభవిస్తున్న ఈ ప్రకృతి విపత్తు ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, శాస్త్రవేత్తలు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారని తెలిపారు. గత 75 సంవత్సరాలలో ఎన్నోసార్లు ఎల్ నినో వచ్చినా.. ఈసారి దాని తీవ్రత వాటన్నింటినీ మించి ఉండబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అధిక ఉష్ణోగ్రతల వల్ల రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగి, ఉత్పత్తి తగ్గిందని సీఎం తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని, విద్యుత్‌తో పాటు నీటి అవసరాలు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయన్నారు. సాగునీటి సరఫరాను తగ్గిస్తూ, తాగునీటి కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన క్లిష్ట పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పారు.

రైతులకు కీలక విజ్ఞప్తి:

ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి రైతాంగం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాబోయే వేసవిలో రైతులు పంటలు వేయవద్దని, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని పెద్దమనసుతో అండగా నిలవాలని కోరారు. వ్యవసాయ కూలీలను ఉపాధి హామీ పథకం ద్వారా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో కలిపి ప్రస్తుతం కేవలం 290 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని వివరించారు.

ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పక్కా కార్యాచరణ రూపొందించిందని, తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు, రైతులు నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటూ ఈ విపత్తును జయించేందుకు ప్రభుత్వంతో కలసి రావలసిందిగా కోరారు.