జాతీయ జెండా ఎగరేస్తే జైలా? కేంద్రంపై అభిజీత్, నేహా బోరా తీవ్ర ఆగ్రహం

Abhijit Dipke

Abhijit Dipke

Abhijit Dipke: జాతీయ జెండాను ఎగురవేసినందుకు తమ సహచరులను జైలులో పెట్టడం దారుణమని, రాజధాని ఢిల్లీని స్తంభింపజేసింది సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడటానికేనా అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా ప్రశ్నించారు. ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌లతో కలసి ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ సహచర మిత్రులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను కేవలం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకే అరెస్టు చేసి జైలులో పెట్టారని ఆరోపించారు. జాతీయ జెండాను ఆవిష్కరించడం ఏ చట్టానికి వ్యతిరేకమో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

తాము చేపడుతున్న శాంతియుత నిరసనలను అణచివేసేందుకే ప్రభుత్వం మెట్రో రైళ్లను మూసివేసి, ఢిల్లీని భారత్-పాకిస్తాన్ సరిహద్దులా మార్చేసిందని అభిజీత్ మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కేవలం జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడటం కోసమే సొంత ప్రజలపైనే యుద్ధం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి సీఈసీ సహాయం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అందుకే ప్రధాని మోదీ ఆయనకు అంత భద్రత కల్పిస్తున్నారా అని నిలదీశారు.

ఈ సందర్భంగా నేహా బోరా మాట్లాడుతూ.. సీఈసీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలన్నీ ఒక్కటేనని, రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడుకునేందుకు ఏకమై పోరాడతామని స్పష్టం చేశారు. సీజేపీ నేతలకు జ్యుడీషియల్ కస్టడీ విధించడమంటే ఓటు హక్కును కోల్పోయిన 13 కోట్ల మంది పౌరులను నిర్బంధించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రెస్ మీట్‌లో ఉద్రిక్తత

కాగా, ఈ మీడియా సమావేశంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అభిజీత్ దీప్కే, నేహా బోరా, ప్రకాశ్ రాజ్‌లు మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు వారికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో ప్రెస్ మీట్ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. నిరసనకారుల చర్యలతో పత్రికా సమావేశం కొంతసేపు నిలిచిపోయింది.