మెటాకు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ఫేక్ న్యూస్, అల్గారిథమ్‌లపై ఉక్కుపాదం!

Meta Warning

Meta Warning

Meta Warning: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఫేక్ న్యూస్ ప్రచారం అరికట్టడం, ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ప్రముఖ టెక్ దిగ్గజం ‘మెటా’ సంస్థకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక కీలక అడ్వైజరీని జారీ చేసింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను ప్రమోట్ చేసే సిఫార్సు వ్యవస్థలు (రికమండేషన్ సిస్టమ్స్), కంటెంట్-ర్యాంకింగ్ అల్గారిథమ్‌లను తక్షణమే సమీక్షించాలని కేంద్రం ఆదేశించింది. వినియోగదారులకు ఒకే రకమైన లేదా పరిమితమైన కథనాలు ఎక్కువగా కనిపిస్తూ, ఏకపక్ష సమాచారం వ్యాప్తి చెందేలా ఈ వ్యవస్థలు పనిచేయకూడదని గట్టి హెచ్చరిక జారీ చేసింది. సోషల్ మీడియాలో వచ్చే సమాచారంలో తగిన వైవిధ్యం, విశ్వసనీయత స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

పాత వీడియోలు, సందర్భ రహిత దృశ్యాలు, ఎడిట్ చేసిన ఫోటోలను ప్రస్తుతం జరుగుతున్న ఘటనలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే కంటెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించింది. ఇటువంటి వివాదాస్పద పోస్టులు అల్గారిథమ్‌ల ద్వారా తీవ్రంగా ప్రచారం కాకుండా కట్టడి చేయాలని మెటా సంస్థకు కేంద్ర మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పారదర్శకత, బాధ్యతాయుత వాతావరణం పెంపొందించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది.