Driving License: మోటారు వాహనదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు రహదారి భద్రతను మరింత కఠినతరం చేసే దిశగా కేంద్ర రవాణా శాఖ కీలక అడుగులు వేస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ జారీ, వివరాల సవరణ ప్రక్రియల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. రహదారులపై ప్రమాదాల సంఖ్యను తగ్గించి సురక్షిత ప్రయాణాన్ని ప్రోత్సహించడమే ఈ సవరణల ప్రధాన లక్ష్యమని రవాణా శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
కొత్త ప్రతిపాదనల ప్రకారం సేఫ్ డ్రైవింగ్ ట్యుటోరియల్ పరీక్షలో ఉత్తీర్ణత (పాస్) మార్కులను ప్రస్తుతం ఉన్న 60 శాతం నుండి ఏకంగా 75 శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. డ్రైవింగ్ పట్ల పూర్తి అవగాహన, బాధ్యత ఉన్న వారికే లైసెన్స్ దక్కాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆధార్ కార్డ్ ఆధారంగా వివరాలను డిజిటల్‌గా ధృవీకరించుకుని ఆన్లైన్లో పొందే కొన్ని రకాల డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు సంబంధించి ఫీజు మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు.
మరోవైపు డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా, పేరు లేదా ఇతర వివరాల మార్పు ప్రక్రియను ఉచితంగా అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఈ వివరాల సవరణ కోసం వసూలు చేస్తున్న రూ. 200 రుసుమును పూర్తిగా రద్దు చేయాలని కేంద్రం యోచిస్తోంది. సవరణల కోసం వచ్చే దరఖాస్తులను అధికారులు నిబంధన-16 ప్రకారం 15 రోజుల్లోగా ఆమోదించడం లేదా బలమైన కారణాలతో తిరస్కరించడం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే దానికి గల స్పష్టమైన కారణాలను లేఖ లేదా డిజిటల్ మాధ్యమాల ద్వారా అభ్యర్థికి ఖచ్చితంగా తెలియజేయాలి.
అడ్రస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రత్యేకంగా 30 రోజుల గడువును నిర్దేశించారు. ఈ 30 రోజుల్లోగా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే, ఆ అభ్యర్థన ఆటోమేటిక్‌గా ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారు. అయితే ఈ ‘ఆటోమేటిక్ ఆమోదం’ సౌకర్యం కేవలం చిరునామా మార్పునకు మాత్రమే వర్తిస్తుందని, మిగిలిన సవరణలకు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.
