DJ sound: డీజే సౌండ్ల తీవ్రతకు పాత ఇందిరమ్మ భవనం స్లాబ్ పెచ్చులు కూలిపడి ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు తీవ్రంగా గాయపడిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామంలో చోటుచేసుకుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఊరేగింపుగా వెళ్తున్న దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో భారీ శబ్దాలతో డీజే సౌండ్లు ఏర్పాటు చేశారు.
బాధితుడు కొనింటి శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన భార్య పల్లవి, కుమారుడు మనస్విత్, కుమార్తెలు వివేక, స్వాతికతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారు. శోభాయాత్ర సందర్భంగా వచ్చిన డీజే శబ్దాల తీవ్రతకు వారి ఇంటి స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడి నిద్రిస్తున్న వారిపై పడ్డాయి. ఈ ప్రమాదంలో కుమారుడు మనస్విత్, కుమార్తె వివేకకు తీవ్ర గాయాలు కాగా, కుటుంబంలోని మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని తక్షణమే మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గ్రామీణ ప్రాంతాల్లో డీజే శబ్దాల నియంత్రణపై అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
