ప్రాణాలు కాపాడే ఫ్యాన్లు.. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ వినూత్న అడుగు!

Anti Suicide

Anti Suicide

Anti Suicide: విద్యార్థుల్లో పెరుగుతున్న తీవ్ర మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ధోరణులను నివారించేందుకు గుజరాత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ ఒక వినూత్న, కీలక నిర్ణయం తీసుకుంది. హాస్టల్ గదుల్లో విద్యార్థులు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోకుండా నిరోధించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 354 ‘యాంటీ సూసైడ్ ఫ్యాన్లను’ అమర్చింది. గుజరాత్ రాష్ట్రంలో ఒక విశ్వవిద్యాలయం ఇటువంటి సాంకేతిక భద్రతా చర్యలను చేపట్టడం ఇదే తొలిసారి.

ఒక్కో ఫ్యాన్‌కు సుమారు రూ. 1,500 అదనపు ఖర్చుతో ప్రత్యేక స్ప్రింగ్ పరికరాన్ని బిగించారు. ఫ్యాన్‌పై సాధారణ బరువు కంటే ఎక్కువగా, అంటే సుమారు 10 కిలోల కంటే ఎక్కువ భారం పడగానే ఇందులోని ప్రత్యేక స్ప్రింగ్ వ్యవస్థ తక్షణమే స్పందిస్తుంది. దీంతో ఫ్యాన్ కిందికి దిగిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా కూడా స్వయంచాలకంగా నిలిచిపోతుంది. అధిక భారం పడిన వెంటనే ప్రమాదాన్ని నివారించేలా రూపొందించిన ఈ సాంకేతికత ద్వారా హాస్టళ్లలో విద్యార్థుల అమూల్యమైన ప్రాణాలను కాపాడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.