Democratic Institutions: ప్రజాస్వామ్య సమాజంలో విభిన్న సంస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు బలంగా ఉండటమే దేశ సమగ్ర అభివృద్ధికి అత్యంత కీలకమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పబ్లిక్ లేదా ప్రైవేట్ రంగాలు ఏదైనా సరే, దేశం వేగంగా ముందుకు సాగాలంటే బలమైన వ్యవస్థల నిర్మాణం ఆవశ్యకమని స్పష్టం చేశారు.
ముఖ్యంగా వైద్య, ఆరోగ్య రంగంలో రోగుల సంరక్షణ, ఆరోగ్య సంక్షేమంపై ఆయా ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులు నిరుపేద ప్రజలకు పెద్దపీట వేస్తూ నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందేలా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మొత్తం ప్రజారోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని ఆయన సూచించారు. ప్రజా సంక్షేమానికి పటిష్టమైన వ్యవస్థలే శ్రీరామరక్ష అని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
