మాతో టచ్‌లో 200 మంది ఉన్నతాధికారులు.. రాహుల్ గాంధీ సంచలన ప్రకటన

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సుమారు 200 మంది ఉన్నతాధికారులు తమతో నిరంతరం టచ్‌లో ఉన్నారని, లోపల జరుగుతున్న సమాచారాన్ని అందిస్తున్నారంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈడీ (ED), సీబీఐ (CBI), విదేశాంగ శాఖ (MEA)లకు చెందిన కీలక అధికారులు తమతో సంప్రదింపుల్లో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి నేరుగా వ్యాఖ్యానించారు.

రాజ్యాంగ పరిరక్షణకే ఈ పోరాటం

దేశంలో ప్రస్తుతం జరుగుతున్నది మోదీకి, తనకూ మధ్య యుద్ధం కాదని.. దేశ యువత భవిష్యత్తును, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం సాగుతున్న ధర్మపోరాటమని రాహుల్ స్పష్టం చేశారు. దేశంలో ఎన్నికల వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే వరకు తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పారదర్శకత కరువైందని దుయ్యబట్టారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అప్రూవర్‌గా మారాలి

ఐదుగురు కీలక నేరగాళ్లు న్యాయవిచారణను ఎదుర్కొనే వరకు ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదని రాహుల్ హెచ్చరించారు. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణం రాజీనామా చేసి అప్రూవర్‌గా మారితే వదిలేస్తామని వ్యాఖ్యానించారు. ఈ విఫల ప్రక్రియలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదని, ఆయన ఒక తప్పు చేశారని.. ఆ తప్పు చేయించిన అసలు సూత్రధారులు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలేనని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ చేపట్టిన ‘ఛలో ఢిల్లీ – మార్చ్ ఫర్ డెమోక్రసీ’ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.