తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్? వారానికి 5 రోజుల పనిదినాలపై ప్రభుత్వానికి కీలక వినతి

Employee Demand

Employee Demand

Employee Demand: కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో అమలు అవుతున్న మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఉమ్మడి జేఏసీ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజీవ్ జోషికి సమర్పించింది. జేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు సంతకాలతో కూడిన ఈ వినతిపత్రాన్ని సీఎస్‌కు అందజేసి, విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పనివేళలు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల పనిదినాల విధానం తీసుకొస్తే పనివేళలను ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సవరించవచ్చని జేఏసీ ప్రతిపాదించింది. రోజుకు 7.30 గంటల చొప్పున పని చేస్తే, రెండో శనివారం సెలవును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ వారానికి 37.5 గంటల పూర్తిస్థాయి పనివేళలు పూర్తవుతాయని వివరించారు.

విద్యుత్, ఇంధన ఆదాకు దోహదం:

ప్రస్తుతం ఎదురవుతున్న ఎల్ నినో ప్రభావం, నీటి కొరత ముప్పును దృష్టిలో ఉంచుకుని ఐదు రోజుల పనిదినాల విధానం ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఈ విధానం వల్ల ప్రభుత్వ ఆఫీసుల్లో విద్యుత్, నీటి వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా రోడ్లపై వాహనాల రాకపోకలు తగ్గి ఇంధనం ఆదా కావడంతో పాటు వాయు కాలుష్యాన్ని సైతం నియంత్రించవచ్చని పేర్కొన్నారు.

వారానికి రెండు రోజుల విశ్రాంతి లభించడం వల్ల ఉద్యోగుల్లో పని ఒత్తిడి తగ్గి, వారి మానసిక ఆరోగ్యం, పనితీరు, సామర్థ్యం మెరుగుపడతాయని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ విధానం అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదని, పైగా వివిధ రూపాల్లో ప్రభుత్వ ఖర్చులు తగ్గి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కాబట్టి ఈ అంశంపై సానుకూలంగా స్పందించి త్వరగా ఉత్తర్వులు జారీచేయాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.