నగల పార్సిల్‌తో డెలివరీ బాయ్ జంప్.. ర్యాపిడో రైడర్ చేతివాటం!

Rapido Scam

Rapido Scam

Rapido Scam: నగరంలో బైక్ డెలివరీ యాప్‌ల సేవలను ఆసరాగా చేసుకుని డెలివరీ బాయ్ చేతివాటం ప్రదర్శించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో కూడిన పార్సిల్‌ను గమ్యస్థానానికి చేర్చకుండా ర్యాపిడో రైడర్ పరారయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే.. వివో సంస్థలో అడ్మిన్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి బంజారాహిల్స్ నుంచి నాగోలులో ఉన్న తన బంధువుల ఇంటికి పంపేందుకు కొన్ని విలువైన బంగారు నగలతో పార్సిల్ సిద్ధం చేశారు. రవాణా సౌలభ్యం కోసం ర్యాపిడో యాప్ ద్వారా బైక్ డెలివరీ సేవలను బుక్ చేసుకున్నారు. బుకింగ్ ఆధారంగా వచ్చిన ర్యాపిడో రైడర్ బంగారు ఆభరణాల పార్సిల్‌ను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అయితే ఎంతసేపటికీ పార్సిల్ నాగోలులోని బంధువుల ఇంటికి చేరకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు ర్యాపిడో రైడర్‌కు ఫోన్ చేశారు. అతడు ఫోన్ ఎత్తకపోగా, బాధితుడి నంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి మొబైల్ స్విచ్ఛాఫ్ చేసి అదృశ్యమయ్యాడు. ఈ మోసంపై బాధితుడు వెంటనే ర్యాపిడో కస్టమర్ కేర్‌ను సంప్రదించినప్పటికీ వారి నుంచి ఎలాంటి సరైన స్పందన లభించలేదు.

దీంతో చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ర్యాపిడో యాప్‌లో నమోదైన డెలివరీ రైడర్ వివరాలు, రూట్ మ్యాప్ ఆధారంగా గాలింపు చర్యలు వేగవంతం చేశారు.