విష వలయంలో పిట్టంపల్లి.. కాలుష్య కోరల్లో కన్నీటి గాథ!

Pittampalli Pollution

Pittampalli Pollution

Pittampalli Pollution: నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పిట్టంపల్లి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని కమ్ముకున్న కెమికల్ కాలుష్యంపై బాధితులు ఎన్నోసార్లు ఆందోళనలు చేపట్టారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (PCB) అధికారులకు, జిల్లా కలెక్టరేట్‌కు పదే పదే విజ్ఞప్తులు సమర్పించారు. కానీ, ఆ వినతిపత్రాలన్నీ అధికారుల టేబుళ్లపై నుంచి కేవలం బుట్టదాఖలు కావడమే తప్ప, క్షేత్రస్థాయిలో ఎటువంటి శాశ్వత చర్యలు మాత్రం శూన్యంగా మారాయి.

ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా, భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నా ప్రభుత్వాలు, సంబంధిత శాఖల అధికారులు మాత్రం పట్టించుకోని రీతిలో వ్యవహరిస్తున్నారు. ఒకవైపు కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అధికారుల ఉదాసీనత కారణంగా… మరోవైపు రోజురోజుకూ కొత్త పరిశ్రమలు పుట్టగొడుగులా పుట్టుకొస్తూనే ఉన్నాయి. “కంపెనీలు వస్తూనే ఉన్నాయి.. మాకు అసలు ఊపిరి ఆడడం లేదు” అంటూ ఆ పల్లె ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు.
అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన స్థానికులకు ఏ ప్రభుత్వ వ్యవస్థపై కూడా నమ్మకం సడలిపోతోంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు మారినా పిట్టంపల్లి తలరాత మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, బుట్టదాఖలైన వినతిపత్రాలపై దృష్టి సారించి, ఆ కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆ గ్రామాలు పూర్తిగా కనుమరుగవడం తథ్యం.