శ్రీశైలంలో విశేష పూజలు.. భక్తులకు అభయమిస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు!

Temple News

Temple News

Temple News: మహాశివుడు, భ్రమరాంబ సమేతుడై విలసిల్లే పవిత్ర శ్రీశైల మహాక్షేత్రంలో షష్ఠి తిథిని పురస్కరించుకుని భక్తిపారవశ్యం విల్లివిరిసింది. లోకకల్యాణమే పరమ లక్ష్యంగా దేవస్థానం ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి అత్యంత వైభవంగా విశేష పూజాధికాలు నిర్వహించింది. శాస్త్రోక్తంగా జరిగిన ఈ అభిషేక మహోత్సవంలో పాల్గొన్న భక్తులు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి మైమరిచిపోయారు. ఆలయంలోని అర్చకులు వైదిక నియమాల ప్రకారం ఈ పవిత్ర క్రతువును దిగ్విజయంగా పూర్తిచేశారు.

పంచామృతాలు, పండ్ల రసాలతో దివ్యాభిషేకం

ఈ విశేష పూజల సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరినీళ్లతో పాటు వివిధ రకాల తాజా పండ్ల రసాలతో కంటికింపుగా అభిషేకం జరిపించారు. ఆగమ శాస్త్రాల ప్రకారం వివిధ పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. గణపతి పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అభిషేకము, అర్చన అనంతరం సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణాలు మహోజ్వలంగా సాగాయి. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో, వేదమంత్రోచ్ఛారణలతో ప్రతిధ్వనించింది.

సర్వజన సౌఖ్యం కోసం పవిత్ర సంకల్పం

ఈ అభిషేక కార్యక్రమానికి ముందుగా అర్చకస్వాములు చదివిన లోకక్షేమ సంకల్పం అందరినీ ఆకట్టుకుంది. దేశం సుభిక్షంగా, శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సమయానికి తగినంత వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. ప్రమాదాలు, అకాల మరణాలు కాకుండా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, అగ్ని మరియు వాహన ప్రమాదాల నుంచి రక్షణ కలగాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మహాగణపతిని, సుబ్రహ్మణ్యస్వామిని అర్చకులు ప్రార్థించారు.

జాతక దోషాల నివారణకు.. సంతాన ప్రాప్తికి అభయం

శివాలయాల్లో ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం మరియు షష్ఠి తిథి రోజుల్లో దేవస్థానం ఆధ్వర్యంలో ఈ విశేష అభిషేకాలను సర్కారీ సేవగా క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది. కుమారస్వామివారిని నిష్ఠతో ఆరాధించడం వల్ల ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి పనులు సక్రమంగా పూర్తవుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా శత్రుబాధలు, గ్రహపీడలు, నరదృష్టి వంటివి తొలగిపోతాయని, సంతానం కోసం వేచిచూసే దంపతులకు స్వామివారి అనుగ్రహంతో తప్పక సంతానభాగ్యం లభిస్తుందని పురాణాలు చాటుతున్నాయి.