Fake Currency: నగరం శివారులో భారీ ఎత్తున నకిలీ కరెన్సీ ముద్రిస్తూ, నకిలీ ఐడీ కార్డులతో పోలీసులమంటూ బెదిరింపులు, దోపిడీలకు పాల్పడుతున్న ముఠా ఆటను కట్టించారు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్, షాద్‌నగర్ ఎస్ఓటీ (SOT) పోలీసులు. సమయస్ఫూర్తితో నిరంతరం నిఘా ఉంచి చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు బృందం ఏకంగా రూ. 6.78 కోట్ల విలువ కలిగిన 500 రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసు వివరాలను సీపీ డాక్టర్ తరుణ్ జోషి అబ్దుల్లాపూర్‌మెట్ పిఎస్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద డిజైర్ కారులో ప్రయాణిస్తున్న అనుమానితులను ఎస్ఓటీ, స్థానిక పోలీసులు వాహన తనిఖీల్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు మడుపోజు రత్నాకర్ (ఏ1), చిన్నోళ్ల మాణిక్యరెడ్డి (ఏ2), చెరుకుపల్లి రత్నాకర్‌రెడ్డి (ఏ3), కరణం అజయ్‌కుమార్ (ఏ4)లుగా తేలడంతో వారిని అరెస్టు చేశారు. కాగా ఈ కేసుతో సంబంధమున్న జెల్లి వెంకటేష్, కుంజా బాలరాజు, కంపసటి శ్రీనివాస్‌లు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
కుంట్లూరులోని ఒక అద్దె ఇంట్లో రహస్యంగా కేంద్రం ఏర్పాటు చేసి యూట్యూబ్, సోషల్ మీడియా వీడియోల ఆధారంగా ఫోటోషాప్ సాయంతో రూ. 500 నకిలీ నోట్లను ప్రింట్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. వీరు నకిలీ ఐడీ కార్డులు, డమ్మీ పిస్టల్స్, వాకీటాకీలు చేతపట్టుకుని పోలీసులమని బెదిరిస్తూ పలువురి నుంచి లక్షల రూపాయలు దోచుకున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి కలర్ ప్రింటర్లు, స్కానర్లు, లామినేషన్ మిషన్, ల్యాప్‌టాప్, నకిలీ నంబర్ ప్లేట్లు, కటింగ్ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాణాలకు తెగించి భారీ దోపిడీ ముఠాను సమర్థవంతంగా మట్టుబెట్టిన పోలీసుల కష్టాన్ని, పనితీరును ఉన్నతాధికారులు కొనియాడారు.
