స్కూళ్ళు, కాలేజీల్లో సినిమా ప్రమోషన్లకు చెక్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

School Restrictions

School Restrictions

School Restrictions: విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన విద్యా సంస్థలు ఇటీవలి కాలంలో దారి తప్పుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెక్కల కష్టం ధారపోసి, లక్షల రూపాయల ఫీజులు చెల్లించి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థల్లో చేర్పిస్తుంటే, కొన్ని యాజమాన్యాలు విద్యార్థులను తమ రాజకీయ, ప్రచార, కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలో అనేక అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవడమే కాకుండా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి.

ఈ తీవ్ర పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల్లో సినిమా ప్రమోషన్లు, ఇతర ప్రైవేటు వ్యాపార కార్యక్రమాలపై పూర్తి నిషేధం విధించాలని తీవ్రంగా యోచిస్తోంది. విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా సెలవులు ప్రకటించడం, కనీస భద్రతా జాగ్రత్తలు తీసుకోకుండా భారీ ఈవెంట్లు నిర్వహించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యా సంస్థల క్యాంపసలలో చట్టపరంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు, ఎటువంటివి పూర్తిగా రద్దు చేయాలనే అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రభుత్వం విద్యా శాఖ అధికారులను ఆదేశించింది.

ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం విద్యా సంస్థల ప్రాంగణాలను విద్య, క్రీడా పోటీలకు మాత్రమే వినియోగించాలి. సినిమా వేడుకలు, వాణిజ్య ప్రచారాలకు అనుమతులు నిరాకరించనున్నారు. విద్య, క్రీడా కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహిస్తే ఎంతమంది హాజరవుతారు, స్టేజీ నిర్మాణం, రవాణా ఏర్పాట్లు, ఫైర్ సేఫ్టీ తదితర వివరాలను ముందుగానే స్థానిక విద్యా శాఖ అధికారులు, పోలీసులకు అందజేయాల్సి ఉంటుంది. విద్యార్థుల భద్రతకు విఘాతం కలిగిస్తే యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తప్పవని యంత్రాంగం స్పష్టం చేస్తోంది.