Kulgam Attack: జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడికి సంబంధించిన భయానక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉగ్రమూకలు దారుణానికి ఒడిగట్టాయి. ఉగ్రవాదులు కేవలం 15 సెకన్ల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 30 రౌండ్ల పాటు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
ఈ అకస్మాత్తు దాడిలో హెడ్ కానిస్టేబుల్ సోమ్వీర్ సింగ్, కానిస్టేబుళ్లు రాకేష్ దాస్, సంతోష్ చంద్ర తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తూటాల వర్షం కురుస్తున్న సమయంలో జవాన్లు వెంటనే అప్రమత్తమై తమ వద్ద ఉన్న ఆయుధాలతో ఎదురుకాల్పులు జరుపుతూ వీరోచితంగా పోరాడారు. విపరీతమైన అరుపులు, తూటాల శబ్దాలతో ఆ ప్రాంతమంతా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి పరిసర ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అదనపు బలగాలను మోహరించి, లౌడ్స్పీకర్ల ద్వారా ప్రజలను ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా దాడి సమయానికి కుల్గామ్ జిల్లాలోనే పర్యటనలో ఉండటంతో అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
