విధి నిర్వహణలోనే కాదు.. మరణంలోనూ ప్రజాసేవే! అవయవదానంతో అమరత్వం పొందిన ఏఎస్సై నర్సింహ

Organ Donation

Organ Donation

Organ Donation: శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమించే పోలీసు అధికారులు బతికి ఉన్నప్పుడే కాదు, మరణానంతరం కూడా సమాజం పట్ల తమ త్యాగనిరతిని చాటుకుంటారని నిరూపించారు ఒక నిబద్ధత కలిగిన పోలీసు అధికారి కుటుంబం. సికింద్రాబాద్ జీఆర్పీ ఏఆర్ ఏఎస్సైగా సేవలందిస్తున్న ఈ. నర్సింహ (57) అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురై బ్రెయిన్ డెడ్ కావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో కూడా ఆయన కుటుంబం చూపిన ఔదార్యం అందరినీ కంటతడి పెట్టించింది.

తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు శోకంలో మునిగిపోయినప్పటికీ, తోటివారి ప్రాణాలు నిలపాలనే మహోన్నత సంకల్పంతో నర్సింహ సతీమణి లక్ష్మి ముందుకు వచ్చి ఆయన అవయవదానానికి అంగీకారం తెలిపారు. మరణంలోనూ మరొకరికి జీవితాన్ని ప్రసాదించాలనే ఆ కుటుంబ త్యాగగుణం సమాజానికి ఒక చిరస్మరణీయమైన సందేశాన్నిచ్చింది.

కొన్ని అనివార్య వైద్య కారణాల వల్ల అవయవాల సేకరణ సాధ్యపడకపోయినప్పటికీ, ఆ కష్టసమయంలో ఆ కుటుంబం చూపిన మానవత్వం, సామాజిక బాధ్యత అత్యంత ప్రశంసనీయం. విధి నిర్వహణలో నిబద్ధత చాటి, అమరత్వంలోనూ సమాజం కోసం ఆలోచించిన నర్సింహ పవిత్ర ఆత్మకు అధికారులు, స్థానికులు ఘనంగా నివాళులర్పించారు. శోకసంద్రంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు పలువురు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.