Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పనితీరుపై ప్రముఖ వ్యాపారవేత్త, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల ప్రశంసల వర్షం కురిపించారు. నారా లోకేశ్‌ను ఆమె ఏకంగా ఒక ‘రాక్‌స్టార్ మినిస్టర్’గా అభివర్ణించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. రాష్ట్రంతో పాటు దేశ ప్రగతి కోసం ఆయన అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని ఉపాసన కొనియాడారు.
నేటి తరం యువతకు నారా లోకేశ్ ఒక నిజమైన ప్రతినిధి అని ఉపాసన అభిప్రాయపడ్డారు. ఆయనలో ఉన్న ఉత్సాహం, పని పట్ల అంకితభావం, చురుకుదనం రాష్ట్రవ్యాప్తంగా వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో స్పష్టంగా కనిపిస్తోందని ప్రశంసించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ స్థాయిలో భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో మంత్రి చూపిస్తున్న చొరవ, పారిశ్రామికవేత్తలకు కల్పిస్తున్న భరోసా అభినందనీయమని పేర్కొన్నారు.
కేవలం 16 నెలల స్వల్ప కాలవ్యవధిలోనే రాష్ట్రానికి ఏకంగా 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకురావడం ఒక అద్భుతమైన విజయమని ఉపాసన కొణిదెల ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాలనలో వేగం, పారదర్శకత ఉంటేనే ఇంతటి భారీ స్థాయిలో పెట్టుబడులు సాధ్యమవుతాయని తెలిపారు. ఈ పెట్టుబడుల వెల్లువతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడమే కాకుండా, రాష్ట్రంలోని లక్షలాది మంది యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక ప్రముఖ పారిశ్రామిక కుటుంబం, సామాజిక సేవా రంగ ప్రతినిధి అయిన ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతుంది.
