Janasena Telangana: తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని మరింత బలంగా చాటుకునేందుకు జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 సాధారణ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేసేందుకు వీలుగా భారీ సంస్థాగత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలోని పాత కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయం గురువారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
ఈ నిర్ణయం మేరకు జూన్ 2, 2026కు ముందు నియమితులైన అన్ని పార్లమెంట్, జిల్లా, అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఇన్‌ఛార్జ్ పదవులను రద్దు చేశారు. అంతేకాకుండా పీవోసీ, విద్యార్థి, యువజన, వీరమహిళా విభాగాలతో పాటు ఎమ్మెల్సీ కోఆర్డినేటర్లు, అడ్హక్ కమిటీలను కూడా తక్షణమే రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులతో పాటు జూన్ 2 తర్వాత ఏర్పాటైన జాయినింగ్ కమిటీ, అధికార ప్రతినిధులు మాత్రం యథావిధిగా తమ బాధ్యతల్లో కొనసాగుతారని పార్టీ పేర్కొంది.
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ అంచెలంచెలుగా నూతన కమిటీలను నియమించనున్నారు. పాత పదవుల రద్దు అనేది కార్యకర్తల సేవలకు ముగింపు కాదని, క్షేత్రస్థాయిలో మరింత బాధ్యతాయుతమైన, బలమైన నూతన నాయకత్వ వ్యవస్థకు మార్గం సుగమం చేసే వ్యూహాత్మక అడుగు అని జనసేన వర్గాలు స్పష్టం చేశాయి.
