Sarpanch Election: ఆంధ్రప్రదేశ్ పల్లె రాజకీయాల్లో ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. గ్రామ సర్పంచ్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆశావహులు వినూత్న ప్రకటనలతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామానికి చెందిన వైద్య విద్యార్థిని విశ్వశ్రీ ప్రియ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే ఎన్నికల్లో తనను గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, గ్రామాభివృద్ధి కోసం తన సొంత నిధుల ద్వారా ఏకంగా రూ.1.50 కోట్లు విరాళంగా అందిస్తానని ఆమె బంపరాఫర్ ప్రకటించారు.
దుళ్ళ గ్రామ మాజీ సర్పంచ్ దివంగత దూడల నాగేశ్వరరావు, రత్నం దంపతుల కుమార్తె అయిన విశ్వశ్రీ ప్రియ ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్నారు. మరో ఏడాదిలో తన వైద్య విద్య పూర్తవుతుందని చెబుతూనే, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడించారు. గతంలో తమ తల్లిదండ్రులు సర్పంచ్‌లుగా పనిచేసి గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశారని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, ఊరిని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కోటిన్నర రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు.
నిజానికి ఇదే గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ తోకల శ్రీనివాస్ ఇటీవల స్పందిస్తూ, సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి రూ.కోటి విరాళం ఇస్తానని ప్రకటించారు. ఆ ప్రకటన మరువకముందే, విశ్వశ్రీ ప్రియ ఏకంగా రూ.1.50 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించడంతో గ్రామ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒక చిన్న గ్రామ సర్పంచ్ పదవి కోసం కోట్ల రూపాయల విరాళాలు ప్రకటించడం పట్ల స్థానికంగా ఆసక్తికర చర్చ సాగుతుండగా, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఏ మేరకు మేలు చేస్తుందన్న విశ్లేషణలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
