సజ్జనార్‌కు ఊహించని షాక్.. భాగ్యనగర నూతన కొత్వాల్‌గా మహేశ్ భగవత్!

IPS Transfers

IPS Transfers

IPS Transfers: తెలంగాణ పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఏకంగా 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భారీ బదిలీల ప్రక్రియలో అత్యంత చర్చనీయాంశంగా, సంచలనంగా మారిన అంశం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) వీసీ సజ్జనార్ బదిలీ. దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్టను తీర్చిదిద్దడం, ఇటీవల కమిషనరేట్ పరిధిలో 75 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్న సజ్జనార్‌ను అకస్మాత్తుగా హైదరాబాద్ సీపీ బాధ్యతల నుంచి తప్పించడం ఇప్పుడు పోలీస్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సజ్జనార్‌ను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా ప్రభుత్వం బదిలీ చేసింది. దీనితో పాటు ఆయనకు ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు, ఇప్పటివరకు లా అండ్ ఆర్డర్ డీజీపీగా పనిచేసిన 1995 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ మురళీధర్ భగవత్‌ను భాగ్యనగర నూతన కొత్వాల్‌గా నియమించింది.

బదిలీ వెనుక అసలు కారణాలేంటి?

పాలనాపరమైన సమర్థతను పెంచడం, రాబోయే కీలక ప్రభుత్వ కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పర్యటనల నేపథ్యంలోనే ఈ భారీ మార్పులు చేపట్టినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే, హైదరాబాద్ వంటి అత్యంత కీలకమైన కమిషనరేట్ బాధ్యతల నుంచి సజ్జనార్‌ను అగ్నిమాపక శాఖకు పంపడం వెనుక అంతర్గత కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల నగరంలో చోటుచేసుకున్న కొన్ని శాంతిభద్రతల అంశాలు మొదలైనవి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

పైగా, 1995 బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి మహేశ్ భగవత్‌కు గతంలో రాచకొండ సీపీగా సుదీర్ఘ అనుభవం ఉండటంతో, రాజధాని నగరంలో శాంతిభద్రతలను మరింత కట్టుదిట్టం చేసేందుకే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ బదిలీలలో ఏసీబీ డీజీగా చారు సిన్హా, మహిళా భద్రత విభాగం డీజీగా సౌమ్య మిశ్రా, జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా, టీజీఎస్ఆర్టీసీ ఎండీగా అనిల్ కుమార్, పౌరసరఫరాల కమిషనర్‌గా వై. నాగిరెడ్డి, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా అకున్ సబర్వాల్‌ను నియమించగా, తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విభాగం బాధ్యతలను స్టీఫెన్ రవీంద్రకు అప్పగించింది. మల్టీ జోన్-1 ఐజీగా కార్తికేయను నియమించింది. మరోవైపు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్‌కు అదనపు బాధ్యతలు కేటాయించింది. ఏది ఏమైనా, దూకుడుకు మారుపేరైన సజ్జనార్ బదిలీ మాత్రం పోలీస్ శాఖలో ఆసక్తికర చర్చకు దారితీసింది.