తెలంగాణపై చలిపులి పంజా.. మరో 48 గంటలు డేంజర్ బెల్స్!

Telangana Weather

Telangana Weather

Telangana Weather: తెలంగాణ రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత క్రమంగా పెరుగుతుండగా, రాగల 48 గంటల్లో చలి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి రాష్ట్రం వైపు వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ పొడి గాలుల కారణంగా రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా తెల్లవారుజాము, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు, వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చలి తీవ్రత దృష్ట్యా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరువలో నమోదవుతున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరులో అత్యల్పంగా 11.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సంగారెడ్డి జిల్లా కోహిర్, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లలో 11.4 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా నగునూర్‌లో 11.5 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్‌లో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వీటితో పాటు కామారెడ్డి జిల్లా డోంగి, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలలో 12.2 డిగ్రీలు, మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్‌లో 12.6 డిగ్రీల సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు.