తెలంగాణ ప్రాజెక్టులకు మోక్షం కలిగేనా? ప్రధాని మోదీ ముందు రేవంత్ రెడ్డి ‘డిమాండ్ల’ చిట్టా!

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy:  తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో మోదీతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల పనులను వేగవంతం చేశామని, భూనిర్వాసితులకు పరిహారం సత్వరమే అందిస్తున్నామని ప్రధానికి సీఎం వివరించారు.

తుమ్మిడిహెట్టి, పాలమూరు ప్రాజెక్టులపై ప్రధాన చర్చ:

ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కోరారు. ముంపు ప్రాంతాలకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగు, తాగునీరు అందుతుందని వివరించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు సానుకూల తీర్పు నేపథ్యంలో జాప్యం లేకుండా అనుమతులు ఇవ్వాలని కోరారు.

నిధుల మంజూరు, ఛత్తీస్‌గఢ్ ఎన్‌ఓసీపై వినతి:

రాష్ట్రంలో 70 నుంచి 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల కోసం ‘సాస్కీ’ కింద అదనంగా రూ. 5,000 కోట్లు మంజూరు చేయాలని సీఎం కోరారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) త్వరగా ఇప్పించాలని, సీతారామ ఎత్తిపోతల సహా వివిధ ప్రాజెక్టులకు పీఎంకేఎస్‌వై కింద నిధులు కేటాయించాలని వినతిపత్రం అందించారు.

ఖేలో ఇండియా గేమ్స్‌కు ఆహ్వానం:

డిసెంబర్ 11 నుంచి 22 వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న 8వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026’ ప్రారంభ, ముగింపు వేడుకలకు రావాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ ఆహ్వానించారు. అంతకుముందు ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో కలిసి సీఎం రేవంత్ ఈ క్రీడల అధికారిక లోగో, మస్కట్‌లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, సీఎస్ సంజయ్ జాజు తదితరులు పాల్గొన్నారు.