స్వామియే శరణం అయ్యప్ప.. మండల పూజలకు తెరుచుకున్న శబరిమల ఆలయం!

Sabarimala

Sabarimala

Sabarimala:  కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండల-మకరవిళక్కు పూజలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 16న సోమవారం సాయంత్రం ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతో ఈ ఏడాది అయ్యప్ప యాత్రా సీజన్‌కు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో శబరిమల పరిసరాలు అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్నాయి. తొలిరోజే భక్తుల రద్దీ పెరిగి క్యూలైన్లు పంప వరకు విస్తరించాయి.

నేడు సాయంత్రం 5 గంటలకు ఆలయ గర్భగుడి ద్వారాలను తెరిచారు. తంత్రి కందరారు బ్రహ్మదత్తన్ మార్గదర్శకత్వంలో కొత్త ప్రధాన అర్చకుడు సుబ్రహ్మణ్య శంకరన్ నంబూద్రి, మాళికాప్పురం ఆలయ ప్రధాన అర్చకుడు దామోదరన్ నంబూద్రి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పవిత్రమైన పద్దెనిమిది మెట్లు అధిరోహించి సన్నిధానానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలతో యాత్రా సీజన్ ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజామున నెయ్యాభిషేకం అనంతరం భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించనున్నారు.

రోజుకు 80 వేల మందికి దర్శనం

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు రోజుకు గరిష్ఠంగా 80 వేల మందికి దర్శన అవకాశం కల్పించనున్నారు. ఇందులో 60 వేల మందికి వర్చువల్ క్యూ విధానం ద్వారా, మరో 10 వేల మందికి నీలక్కల్‌లో స్పాట్ బుకింగ్ ద్వారా టోకెన్లు జారీ చేస్తారు. ఎరుమేలి, పులుమేడు అటవీ మార్గాల ద్వారా ఒక్కో మార్గంలో 3 వేల మందికి, వండిపెరియార్ సత్రం మార్గంలో 2 వేల మందికి అనుమతి ఉంటుంది. ఈ మార్గాల్లోనూ ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరి. పంబ వద్ద స్పాట్ బుకింగ్ సౌకర్యం ఉండదు. తొలిరోజే సుమారు 30 వేల మంది భక్తులు వర్చువల్ క్యూ టికెట్లు బుక్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రతిరోజూ దర్శన వేళలు

ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. ఉదయం 11 గంటల వరకు నెయ్యాభిషేకం కొనసాగుతుంది. మధ్యాహ్న పూజల అనంతరం ఆలయాన్ని మూసివేసి, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తెరుస్తారు. రాత్రి 11 గంటలకు హరివరాసనం అనంతరం ఆలయ ద్వారాలు మూసివేస్తారు. ఈ సమయాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ యాత్రను ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మండల, మకరవిళక్కు పూజల తేదీలు

డిసెంబర్ 27న మండల పూజలు ముగియనున్నాయి. అనంతరం రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. డిసెంబర్ 30న మకరవిళక్కు పూజల కోసం తిరిగి ఆలయాన్ని తెరుస్తారు. జనవరి 14న మకరవిళక్కు మహోత్సవం నిర్వహించనున్నారు. జనవరి 20న పదునెట్టాంబడి పూజ అనంతరం ఆలయాన్ని మూసివేయడంతో ఈ ఏడాది యాత్రా సీజన్ ముగుస్తుంది.

భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు

యాత్రా సీజన్‌లో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాయి. భక్తుల కోసం తాత్కాలిక వసతి కేంద్రాలు, వైద్య సహాయ కేంద్రాలు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. అటవీ మార్గాల్లో ప్రయాణించే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై కూడా అధికారులు దృష్టి సారించారు.

41 రోజుల దీక్షతో అయ్యప్ప దర్శనానికి భక్తులు

అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులు 41 రోజుల పాటు కఠిన దీక్ష చేపట్టి, నియమ నిష్ఠలతో ఇరుముడులు ధరించి శబరిమలకు చేరుకుంటారు. కొండలు, అటవీ మార్గాల గుండా సన్నిధానానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతో భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. రాబోయే రెండు నెలల పాటు శబరిమల అయ్యప్ప నామస్మరణతో మార్మోగనుంది.

స్వామియే శరణం