డేటింగ్ యాప్‌తో డేంజర్.. మత్తు బీర్లతో 36 తులాల బంగారం కొట్టేసిన ముఠా!

Hyderabad

Hyderabad

Hyderabad: సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌ల మాయలో పడి అపరిచితులను నమ్మితే ఎంతటి ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పే షాకింగ్ ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం పెంచుకుని, బాధితుల ఇళ్లకు వెళ్లి మత్తు కలిపిన బీర్లు తాగించి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల ముఠాను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది కాలంలో ఈ ముఠా దాదాపు 14 నేరాలకు పాల్పడి, 36 తులాలకు పైగా బంగారాన్ని దోచుకున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు.

బంగారం ఉన్నవారే టార్గెట్!

నిందితులు ‘గ్రిండర్’ (Grindr) డేటింగ్ యాప్‌లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, తాము గే అని పరిచయం చేసుకుంటూ బాధితులతో చాటింగ్ ప్రారంభించేవారు. ఆ తర్వాత వీడియో కాల్స్ మాట్లాడుతూ వారితో సన్నిహితంగా మెలిగేవారు. ఈ వీడియో కాల్స్ సమయంలోనే అవతలి వ్యక్తుల మెడలో బంగారు గొలుసులు, చేతి వేళ్లకు ఉంగరాలు ఉన్నాయా అనే విషయాన్ని నిశితంగా గమనించేవారు. బంగారు ఆభరణాలు ధరించిన వారిని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని పరిచయాన్ని మరింత పెంచుకునేవారు.

మత్తు మందుతో నిలువు దోపిడీ:

నమ్మకం కుదిరిన తర్వాత ఏకాంతంగా గడుపుదామంటూ బాధితుల ఇళ్లకు వెళ్లేవారు. అక్కడ నమ్మకస్తులమే అన్నట్లు కొద్దిసేపు సన్నిహితంగా ప్రవర్తించి, ఆ తర్వాత సరదాగా బీర్లు తాగుదామని చెప్పేవారు. ముందుగానే తాము తెచ్చుకున్న మత్తు మందును బీర్లలో కలిపి బాధితులకు ఇచ్చేవారు. బాధితులు స్పృహ కోల్పోయిన వెంటనే వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యేవారు.

ఈ ముఠా సభ్యులపై హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధితో పాటు విశాఖపట్నంలోనూ కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, డేటింగ్ యాప్‌లలో అపరిచితుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.