Movement Journalists: తెలంగాణ మలిదశ ఉద్యమంలో కలంతో, గళంతో కదం తొక్కిన ఎల్బీ నగర్ ప్రాంత ఉద్యమ జర్నలిస్టుల ఆవేదన కట్టలు తెంచుకుంది. ‘ఉద్యమ నేలకు అవమానం’ అంటూ ఇటీవల ‘మినిట్ 2 మినిట్’లో కథనం వెలువడిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో, ఇప్పుడు స్వయంగా నిజమైన ఉద్యమ జర్నలిస్టులే బహిరంగంగా గళమెత్తారు. ఉద్యమంతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తులు ‘తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం’ పేరిట కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండటంపై వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
త్యాగాల చరిత్రను స్వార్థానికి వాడుకోవద్దు!
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎల్బీ నగర్ జర్నలిస్టులు ఎన్నో ఆర్థిక కష్టాలు, అవమానాలు, పోలీసు నిర్బంధాలను ఎదుర్కొని రోడ్ల పైకి వచ్చి పోరాడారని వారు గుర్తుచేశారు. “మేము కేవలం ప్రేక్షకులం కాదు.. జై తెలంగాణ నినాదంతో ఉద్యమానికి అండగా నిలిచిన పోరాటయోధులం. త్యాగాలు మావి.. భోగాలు మీవా?” అంటూ నిలదీశారు. ఉద్యమ జర్నలిస్టుల పేరును అడ్డం పెట్టుకుని వసూళ్లకు పాల్పడటాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.
ఆత్మగౌరవ జర్నలిస్టుల సూటి ప్రశ్నలు
ఆత్మీయ సమ్మేళనాల పేరుతో హడావుడి చేస్తున్న నిర్వాహకులకు ఉద్యమ జర్నలిస్టులు పలు సూటి ప్రశ్నలు సంధించారు. కరోనా విపత్కర సమయంలో ఎంతమంది జర్నలిస్టులను ఆదుకున్నారు? విధి నిర్వహణలో ప్రమాదాలకు గురై గాయపడిన వారికి, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక భరోసా కల్పించారు? కష్టకాలంలో ఉన్న తోటి జర్నలిస్టులకు ఏనాడైనా అండగా నిలిచారా? నిజమైన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ఇప్పటివరకు ఏ విధమైన గుర్తింపు తెచ్చారని ప్రశ్నించారు.
పునరాలోచించకపోతే మరో ఉద్యమం తప్పదు!
మీ యూనియన్ పరిధిలో ఏ కార్యక్రమాలైనా నిర్వహించుకునే స్వేచ్ఛ మీకుందని, కానీ తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల పేరుతో నిజమైన పోరాటయోధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఉద్యమం చేయడం తమకు కొత్త కాదని, తక్షణమే ఈ నకిలీ సమ్మేళన ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆ సమ్మేళనంపైనే మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని ఎల్బీ నగర్ ఉద్యమ జర్నలిస్టులు తీవ్రంగా హెచ్చరించారు.
